రాష్ట్రంలో రోజుకు 250 మంది సైబర్ నేరాల బారిన… నెలలోనే రూ.158 కోట్ల నష్టం
హైదరాబాద్:
రాష్ట్రంలో రోజుకు సగటున 250 మంది సైబర్ నేరాల బారిన పడుతుండగా, ప్రతిరోజూ రూ.5.5 కోట్లకు పైగా ప్రజలు మోసాలకు గురవుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 7,500 మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మొత్తం రూ.158 కోట్లు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్, ఏపీకే (APK) ఫైల్స్, ఫేక్ కస్టమర్ కేర్, డిజిటల్ అరెస్టులు, లోన్ ఫ్రాడ్స్ వంటి నేరాలు సైబర్ మోసాల్లో టాప్–5 స్థానాల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో నమోదైన ఈ తరహా కేసుల్లో మొత్తం 96,407 మంది బాధితులు రూ.1,319 కోట్లు నష్టపోయారు.
డార్క్ వెబ్, సోషల్ మీడియా, ఈ–కామర్స్ వెబ్‌సైట్లు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ లింకులు పంపించి ప్రజలను ట్రాప్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాకుండా కార్పొరేట్లు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారని తెలిపారు. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 90 శాతం బాధితులు విద్యావంతులేనని పేర్కొన్నారు. పోలీసుల విస్తృత ప్రచారం ఉన్నప్పటికీ మోసపోయే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరం.
ఫెడెక్స్ కొరియర్, డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త తరహా మోసాలు
దేశవ్యాప్తంగా సైబర్ నేరాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోందని అధికారులు తెలిపారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలు, మెట్రో నగరాలను సైబర్ నేరగాళ్లు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారని చెప్పారు.
డార్క్ వెబ్ ద్వారా కొనుగోలు చేసిన ఫోన్ నంబర్లు, ఏజెన్సీల ద్వారా సేకరించిన బ్యాంక్ అకౌంట్లతో వరుస మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఫెడెక్స్ కొరియర్, డ్రగ్స్, కస్టమ్స్, ట్రాయ్, సీబీఐ, సైబర్ క్రైం పోలీసుల పేరుతో ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తామంటూ కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఫెడెక్స్ కొరియర్‌లో వచ్చిన పార్సిల్‌లో డ్రగ్స్, బంగారం లేదా నిషేధిత వస్తువులు ఉన్నాయని చెప్పి ఢిల్లీ, ముంబై పోలీసుల పేరుతో స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ఇన్వెస్టిగేషన్ పేరుతో గంటల తరబడి వేధిస్తూ, అరెస్ట్ చేస్తామని బెదిరించి బాధితుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు
రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (CSB) సైబర్ నేరాలను కట్టడి చేయడంతోపాటు బాధితులకు అండగా నిలుస్తోంది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS)తో పాటు 1930 సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ‘గోల్డెన్ అవర్’లో అందిన ఫిర్యాదుల ఆధారంగా నేరగాళ్ల అకౌంట్లను వెంటనే ఫ్రీజ్ చేస్తున్నారు.
గత రెండేళ్లలో రూ.534 కోట్లను ఫ్రీజ్ చేయగా, లోక్ అదాలత్ ద్వారా 29,273 మంది బాధితులకు రూ.183 కోట్లు రిఫండ్ చేశారు. మిగిలిన మొత్తం కూడా బాధితుల అకౌంట్లకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నమోదైన 513 సైబర్ నేరాలకు సంబంధించి 393 మంది నేరగాళ్లను అరెస్టు చేయగా, దేశవ్యాప్తంగా నమోదైన 2,901 కేసులతో వారికి లింకులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. సైబర్ నేరాలకు సంబంధించిన 9,431 సిమ్ కార్డులు, 8,856 ఐఎంఈఐ నంబర్లను సీఎస్‌బీ బ్లాక్ చేసింది.
