మయన్మార్ కేంద్రంగా 5.9 తీవ్రత భూకంపం.. కోల్‌కతా, బంగ్లాదేశ్‌లో కంపించిన భూమి
కోల్‌కతా నగరాన్ని మంగళవారం (ఫిబ్రవరి 3) రాత్రి భూకంపం భయపెట్టింది. అకస్మాత్తుగా భూప్రకంపనలు రావడంతో నగరంలోని ఇళ్లు, ఆఫీసులు ఊగిపోగా.. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం మయన్మార్ కేంద్రంగా 5.9 తీవ్రతతో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ (GFZ) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.
మయన్మార్‌లో గత 71 గంటల్లో ఇది మూడోసారి భూకంపం సంభవించడం గమనార్హం. అంతకుముందు అక్కడ 4.1 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప కేంద్రం ప్రకటించింది. ఇక సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు అండమాన్–నికోబార్ దీవుల్లో 4.6 తీవ్రతతో భూకంపం రావడం తర్వాత వరుసగా ఈ ప్రకంపనలు నమోదవడం ప్రజల్లో ఆందోళన పెంచింది.
మంగళవారం రాత్రి సంభవించిన భూకంప ప్రభావం వెస్ట్ బెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్‌కూ విస్తరించింది. కోల్‌కతా, ఢాకా నగరాల్లో భూమి బలంగా కంపించడంతో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు పెచ్చులు ఊడిపోవడం, ఇంట్లోని సామాగ్రి చెల్లాచెదురుగా పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భూకంపం కారణంగా ఇప్పటివరకు ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేకపోయినా.. ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భూకంపం తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరుస భూకంపాలతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతుండగా.. భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందా అనే అంశంపై నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు.
