రవీంద్రభారతిలో ఘనంగా 55వ జాతీయ భద్రతా దినోత్సవం
హైదరాబాద్: రవీంద్రభారతి వేదికగా 55వ జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విభాగం మరియు National Safety Council ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరీ దానికిషోర్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, కార్మికుల రక్షణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు:
మంత్రి మాట్లాడుతూ,
- “సేఫ్టీ అనేది ఖర్చు కాదు… అది ఒక ఇన్వెస్ట్మెంట్” అని స్పష్టం చేశారు.
- భద్రతా ప్రమాణాలు పాటించినప్పుడే ఉత్పాదకత పెరుగుతుందని అన్నారు.
- గతంలో కొన్ని మేనేజ్‌మెంట్లు సేఫ్టీ ఖర్చులను భారంగా భావించేవని, అయితే ఇప్పుడు ఆ దృక్పథంలో మార్పు వచ్చిందన్నారు.
సిగాచి ఫ్యాక్టరీ ఘటనను ప్రస్తావిస్తూ, చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుని రూ.20 లక్షలు ఖర్చు చేసి ఉంటే పెద్ద ప్రమాదం తప్పించుకునే వీలుండేదని తెలిపారు. కానీ ప్రమాదం అనంతరం అదే సంస్థ రూ.40-50 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఉదాహరణ ఇచ్చారు.
- ప్రతి సంస్థ సేఫ్టీపై తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాలని సూచించారు.
- బోర్డు సభ్యులు సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
- కార్మికులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.
- “వర్కర్స్ హ్యాపీగా ఉంటేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి” అని పేర్కొన్నారు.
టెక్నాలజీ వేగంగా మారుతోందని, పరిశ్రమలు ఆ మార్పులకు తగినట్లుగా అలవాటు పడాలని సూచించారు. సీఎం లక్ష్యంగా పెట్టుకున్న 3 ట్రిలియన్ ఎకానమీ సాధనలో పరిశ్రమల పాత్ర కీలకమని, అందుకు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
చివరగా, ప్రతి ఫ్యాక్టరీ జీరో యాక్సిడెంట్ ఫ్యాక్టరీగా మారాలని, ప్రతి కంపెనీ తమ సేఫ్టీ ప్లాన్‌ను సమర్థంగా అమలు చేయాలని, శాఖ అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
