హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. అక్టోబర్‌లో 55 మంది అరెస్ట్
సైబర్ నేరస్తుల ఆగడాలను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఒక్క అక్టోబర్ నెలలోనే 55 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. 196 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడి సొమ్ము పోగొట్టుకున్న బాధితులకు రూ.62.34 లక్షలను తిరిగి అప్పగించినట్లు తెలిపారు. అలాగే నేరస్తులకు చెందిన 61 బ్యాంక్ అకౌంట్లలో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అరెస్టైన సైబర్ నేరస్తులపై దేశవ్యాప్తంగా 136 కేసులు ఉన్నట్లు తెలిపారు. వీటిలో తెలంగాణలోనే 45 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. చైనా పౌరుల ద్వారా డిజిటల్ అరెస్టు స్కామ్ చేస్తున్నట్లు గుర్తించారు.
62 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.1.07 కోట్లు దోచుకున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. అదృశ్యమైన ఫోన్ ద్వారా ముగ్గురు నిందితులు రూ.1.95 లక్షలు దోచుకోగా వారిని కూడా అరెస్టు చేశారు. ఏపీలో ఫేక్ ట్రేడింగ్ యాప్‌తో రూ.24.17 లక్షలు మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్టు, సోషల్ మీడియా ఫ్రాడ్ల ద్వారా 33 సైబర్ మోసాలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 31 సెల్ఫోన్లు, 14 చెక్‌బుక్‌లు, 9 డెబిట్ కార్డులు, 2 ల్యాప్ టాప్స్, 3 షెల్ కంపెనీ స్టాంప్స్, 2 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ అధికారుల పేరుతో ఉన్న ప్రొఫైల్స్ నుంచి వచ్చే మెసేజులను నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. అలాగే తెలియని సోషల్ మీడియా పెట్టుబడి గ్రూపుల్లో చేరవద్దని, ఏపీకే ఫైల్స్, ఫిషింగ్ లింక్స్ వంటి వాటిని ఓపెన్ చేయవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. CBI, RBI, ED, కస్టమ్స్, న్యాయవ్యవస్థ, సైబర్ క్రైమ్ పోలీసులు, నార్కోటిక్స్ బ్యూరో, FedEx, BSNL, TRAI లేదా ఇలాంటి ఏజెన్సీల నుండి వస్తున్నట్లు చెప్పుకునే బెదిరింపు వీడియో కాల్స్ లేదా సందేశాలు వచ్చినప్పుడు ప్రజలు భయపడవద్దని, అనుమానాస్పద కాల్స్, మెసేజ్ లు వచ్చినపుడు 1930 హెల్ప్ లైన్ నంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
