ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందెశ్రీ (అసలు పేరు అందె ఎల్లయ్య) చదువులేమీ లేకపోయినప్పటికీ కవిత్వంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. గొర్రెల కాపరిగా, తరువాత భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగించిన ఆయన, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
“మాయమైపోతున్నడమ్మా” పాటతో గుర్తింపు పొందిన ఆయన రచించిన “జయ జయహే తెలంగాణ” ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రూ. 1 కోటి పురస్కారం ప్రకటించింది.
పురస్కారాలు
- నంది అవార్డు – 2006 (గంగ సినిమా)
- యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ – 2014
- దాశరథి సాహితీ పురస్కారం – 2015
- రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం
- జానకమ్మ జాతీయ పురస్కారం – 2022
- దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం – 2024
- లోక్‌నాయక్ పురస్కారం
ఆశుకవిత్వంలో అందెశ్రీకి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ప్రముఖుల సంతాపం
అందెశ్రీ ఆకస్మిక మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “జయ జయహే తెలంగాణ” గేయం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గొంతుకగా నిలిచిందని ఆయన అన్నారు.
స్పీకర్ ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు సంతాపం తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు కూడా అందెశ్రీ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు
అందెశ్రీ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

