సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలి: భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి జిల్లాలో ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోకుండా, సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఐపీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లు, అలాగే IPO ఆఫర్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు.
మోసగాళ్ల పద్ధతులు
ప్రముఖ కంపెనీల పేరుతో నమ్మదగినట్లుగా కనిపించే నకిలీ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు రూపొందించడం
వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇమెయిల్ వంటి వేదికల ద్వారా ఆకర్షణీయమైన లింకులు పంపడం
“తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు”, “త్వరిత రిటర్న్స్” వంటి వాగ్దానాలతో పెట్టుబడిదారులను నమ్మబలకడం
బ్యాంక్ వివరాలు, ఆధార్, PAN వివరాలు లేదా UPI చెల్లింపులు కోరడం
కొన్నిసార్లు నకిలీ షేర్ సర్టిఫికేట్‌లు పంపి ప్రజలను నమ్మించడం
ప్రజలు డబ్బు బదిలీ చేసిన తరువాత వెబ్‌సైట్ లేదా యాప్‌ను మూసివేసి పరారవడం
నకిలీ ట్రేడింగ్ యాప్‌ల మోసాలు
సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా “రోజుకు భారీ లాభాలు”, “100% రిటర్న్” వంటి తప్పుడు వాగ్దానాలతో ప్రజలను వలలో వేస్తున్నారు.
చిన్న మొత్తంలో కొంత లాభం చూపి నమ్మబలికి, తరువాత పెద్ద మొత్తాలు పెట్టాలని ఒత్తిడి చేస్తారు.
విత్‌డ్రా చేయాలనుకున్నప్పుడు “ట్యాక్స్”, “సర్వీస్ చార్జీలు” పేరుతో మరిన్ని మొత్తాలు అడుగుతారు. చివరికి యాప్ యాక్సెస్‌ను బ్లాక్ చేసి మాయం అవుతారు.
ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఏ IPO లో పెట్టుబడి చేసేముందు SEBI, NSE, BSE అధికారిక వెబ్‌సైట్లు తప్పనిసరిగా తనిఖీ చేయాలి
సోషల్ మీడియాలో వచ్చే IPO ఆఫర్లను నమ్మరాదు
ఎవరైనా అడ్వాన్స్ పేమెంట్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలి
గ్యారంటీ రిటర్న్స్ పేరుతో వచ్చే ఆఫర్లను పూర్తిగా తిరస్కరించాలి
తెలియని యాప్ లింకులు, వెబ్‌సైట్లు వాడకూడదు
పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేసే వ్యక్తులను వెంటనే బ్లాక్ చేయాలి
ఎస్పీ సూచనలు
వినియోగించే ట్రేడింగ్ యాప్ లేదా వెబ్‌సైట్ SEBI/RBI వద్ద రిజిస్టర్డ్ అయ్యిందా అని తప్పనిసరిగా చెక్ చేయాలి
ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే
పోలీసులకు లేదా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
