డిసెంబర్ కన్నా ముందే చలి.. జనజీవనం అస్తవ్యస్థం!
తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలోని ఆదిలా బాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలపై చలి పంజా విసురుతోంది. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి, గ్రామీణ, గిరిజన వర్గాలను గజగజ వణికిస్తున్నాయి.
డిసెంబర్ ప్రవేశించక ముందే ఈ తీవ్రత ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి వీస్తున్న చల్లని గాలుల దాడికి ఈ ప్రాంతం అతలాకుతలమవుతోంది. వాతావరణంలో ఈ అసాధారణ మార్పు దీర్ఘకాలిక ప్రజారోగ్య, ఆర్థిక సమస్యలకు సంకేతంగా నిలుస్తోంది. ఆకస్మిక చలితీవ్రతకు సిద్ధంగా లేని ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు, నిరాశ్రయుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ చలిగాలులు సాధారణ జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, రైతులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి.
గుండెపోటు భయం..
చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ, ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులలో పాటు శ్వాసకోశ వ్యాధుల బాధితులు అధికంగా ప్రభావితమవుతున్నారు. జలుబు, దగ్గు, ఆయాసం, న్యుమోనియా వంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఆసు పత్రులు కిటకిటలాడుతున్నాయి. అధిక చలి కారణంగా రక్త నాళాలు సంకోచించి రక్తపోటు పెరిగి, గుండెపై భారం పడుతుంది. ఫలితంగా, ఇటీవల గుండెపోటు కేసులు పెరగడం, హృద్రోగులలో సమస్యలు తలెత్తడంతో ప్రజలలో మరింత ఆందోళన కలిగిస్తోంది.
సంక్షేమ హాస్టళ్ల దుస్థితి..
చలికాలంలో అత్యంత ఎక్కువ ఇబ్బందులు పడుతున్న వర్గం ప్రభుత్వ వసతి గృహాలు (హాస్టల్స్), గురుకులాల్లోని విద్యార్థులు.. సంగారెడ్డి, సూర్యాపేట వంటి జిల్లాల్లోని సంక్షేమ హాస్టళ్లలో వేడినీటి యంత్రాలు పనిచేయకపోవడం, పూర్తి స్థాయిలో దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కోదాడ, సూర్యాపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్స్లో కిటికీలు, తలుపులు లేకపోవడంతో విద్యార్థులు చల్లని గాలులకు వణుకుతూ నేలపైనే నిద్రిస్తున్నారు. జహీరాబాద్ ఎస్సీ బాలికల వసతి గృహం వంటి శిథిలావస్థ భవనాల్లో సరిపడా మంచాలు లేకపోవడంతో నేలపై కునుకు తీయక తప్పడం లేదు. కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వ వ్యవస్థల విధి నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రైతుకు చలి కోర..
విపరీతమైన చలి వ్యవసాయ రంగంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం యాసంగి పంటకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో, ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వరి నారు ఎదుగుదల మందగిస్తోంది. నారుమళ్లు ఆశించినంతగా పెరగకపోవడంతో నారు నాటు ఆలస్యం అవుతోంది. ఉదయం కురుస్తున్న మంచు, పత్తి వంటి పంటల నాణ్యతను దెబ్బతీసి, రైతుల దిగుబడిపై, ఆదాయంపై ప్రభావం చూపుతోంది. ఇక కూరగాయల పంటలకు సైతం కాత, పూత తగ్గి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి!
ఈ తీవ్రమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రభుత్వ యంత్రాంగం నిద్ర వీడి వేగం పెంచాలి. ప్రభుత్వ హాస్టళ్లలో యుద్ధ ప్రాతిపదికన వేడి నీటి సదుపాయం, సరిపడా దుప్పట్లు, రగ్గులు, పరుపులు పంపిణీ చేయాలి. అలాగే పౌరులు కూడా వ్యక్తిగతంగా కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలి. ఉన్ని వస్త్రాలు, ముఖ్యంగా తల, చెవులు, కాళ్లను కప్పి ఉంచాలి. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇంటి లోపల ఉండాలి. వేడిగా ఉండే ఆహారం, పానీయాలు తీసుకోవాలి. ఈ విపరీత వాతావరణాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ప్రభుత్వ యంత్రాంగం, పౌరులు సమన్వయంతో పని చేయడం అత్యవసరం.
