రెండు కోట్ల ఆధార్ ఐడీలు డీయాక్టివేట్
ఆధార్ డేటాబేస్‌లోని అదనపు వివరాలను తొలగించేందుకు ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దాదాపు రెండు కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. ఆధార్ సమాచారం ఎప్పటికప్పుడు తాజాగా, కచ్చితంగా ఉండేలా ఈ ‘క్లీన్-అప్’ కార్యక్రమాన్ని చేపట్టింది.
చనిపోయిన వారి ఆధార్‌ను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి, లేదా దాన్ని ఉపయోగించి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అనధికారికంగా పొందకుండా నివారించడానికి ఈ చర్యలు చాలా అవసరం. ఏ ఆధార్ నంబర్‌ను కూడా మరొకరికి మళ్లీ కేటాయించరు.
మృతుల వివరాలు సేకరించేందుకు UIDAI అనేక మార్గాలను ఉపయోగిస్తోంది. ముఖ్యంగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి మరణించిన వారి డేటాను సేకరిస్తోంది. భవిష్యత్తులో ఈ వివరాల కోసం ఆర్థిక సంస్థలు సహా ఇతరత్రా విభాగాలతో కూడా కలిసి పనిచేయాలని చూస్తోంది.
