Stray Dogs: కన్నవాళ్లు వదిలేస్తే.. వీధి కుక్కలు కాపాడాయి
ప్రస్తుతం చిన్నారులపై కుక్కలు (Stray Dogs) విచక్షణారహితంగా దాడులు చేస్తున్న వార్తలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న సమయంలో.. అప్పుడే పుట్టిన చిన్నారికి వీధి కుక్కలే రక్షణగా మారిన ఘటన వైరల్‌గా మారింది. ఓ నవజాత శిశువును కన్నవారు రోడ్డుపై వదిలేస్తే.. చిన్నారికి వీధి కుక్కలు రక్షణగా నిలిచిన ఘటన పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నదియా జిల్లాలోని రైల్వేవర్కర్స్ కాలనీలో ఓ బాత్‌రూమ్ ఎదుట అప్పుడే పుట్టిన పసికందును తల్లిదండ్రులు బుధవారం తెల్లవారుజామున వదిలేసి వెళ్లారు. దుప్పటిలో చుట్టి ఉన్న ఆ పసికందు చూట్టూ వీధి కుక్కలు చేరి.. ఉదయం వరకు చిన్నారికి రక్షణగా ఉన్నాయి.
తెల్లవారిన తర్వాత కుక్కల మధ్యలో చిన్నారి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే ఆ పసికందును ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పసికందుపై కుక్కలు వ్యవహరించిన తీరును స్థానికులు ప్రశంసిస్తున్నారు. చిన్నారి చుట్టూ చేరిన కుక్కలు చలిలో కొన్ని గంటల పాటు.. పసికందుకు కాపలాగా నిలబడే ఉన్నట్లు పేర్కొన్నారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించడానికి వెళ్లినప్పుడు ముందు ఎవరినీ దగ్గరకు రానివ్వలేదని తెలిపారు. అనంతరం పొరుగువారి సాయంతో శిశువును మహేశ్‌గంజ్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. చిన్నారిని ఎవరు వదిలివెళ్లారనే విషయం తెలుసుకోవడానికి స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
