US Work Permits: శరణార్థులకు షాక్.. వర్క్ పర్మిట్లపై అమెరికా కీలక నిర్ణయం..
ఇంటర్నెట్‌డెస్క్: వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శరణార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్ (US Work Permits)ల కాలవ్యవధిని కుదిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఓ ప్రకటనలో తెలిపింది.
శరణార్థులు, ఆశ్రయం పొందాలనుకునేవారు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవారు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ (EAD) కింద అనుమతులు జారీ చేస్తారు. దీనికి అయిదేళ్ల కాలవ్యవధి ఉండేది. తాజా సవరణలతో దాన్ని 18 నెలలకు కుదించారు. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఇటీవల అధ్యక్ష భవనానికి సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోకి వలస వచ్చేవారిపై కఠిన సమీక్షలు అవసరమని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం భావిస్తోంది. ఈ క్రమంలోనే వర్క్ పర్మిట్ల కాలవ్యవధిపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఏంటీ EAD?
ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) అనేది ఓ వ్యక్తికి నిర్దిష్ట కాలవ్యవధి వరకు అమెరికాలో పని చేసేందుకు అధికారం ఉందని నిరూపించే పత్రం. ఇది ఉంటేనే వలసదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతులు లభిస్తాయి. గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, ఎఫ్-1, ఎం-1 వీసాలపై వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలపై వచ్చేవారు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఈ EAD పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
