Diamond locket: రూ.లక్షలు విలువైన వజ్రాలు పొదిగిన గుడ్డు లాకెట్‌ను మింగేసిన దొంగ
ఇంటర్నెట్ డెస్క్: రూ.లక్షలు విలువ చేసే వజ్రాలు పొదిగిన గుడ్డు ఆకారంలోని ఓ లాకెట్ (Diamond-studded locket)ను న్యూజిలాండ్(New Zealand)కు చెందిన ఓ దొంగ మింగేసిన అనూహ్య ఘటన ఆక్లాండ్‌లో చోటుచేసుకుంది. దుకాణ యజమాని ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆ దొంగను గుర్తించి లాకెట్‌ను ‘సహజ పద్ధతి’లో స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్ ఆక్లాండ్‌లోని ప్యాట్రిడ్జ్ జ్యువెలర్స్‌లో 32 ఏళ్ల వ్యక్తి వజ్రాలు పొదిగిన గుడ్డు ఆకారంలో ఉన్న ఓ లాకెట్‌ను మింగేసినట్లు ఆభరణాల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అతడిని అరెస్టు చేశారు. ఆ లాకెట్‌లో 60 తెల్ల వజ్రాలు, 15 నీలమణులు, 18 క్యారెట్ల చిన్న బంగారు ఆక్టోపస్ బొమ్మ ఉన్నట్లు ఆభరణాల వ్యాపారి తెలిపారు. దీంతో నిందితుడికి పలు వైద్య పరీక్షలు నిర్వహించి, సహజ పద్ధతిలో ఆ లాకెట్‌ను బయటకు తీసినట్లు న్యూజిలాండ్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాడన్నారు. అదే ఆభరణాల దుకాణం నుంచి నిందితుడు ఓ ఐప్యాడ్‌ను కూడా దొంగిలించినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. విచారణ కోసం నిందితుడిని డిసెంబర్ 8న కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.
