యూట్యూబ్‌లో ‘సాగు’ నేర్చుకొని రూ.లక్షలు ఆర్జిస్తున్న ఇంజినీర్
ఝార్ఖండ్‌లోని చత్రా జిల్లా అంబాటాండ్ గ్రామ యువరైతు ఉదయ్‌కుమార్ ఇంజినీరు ఉద్యోగం వదులుకొని వ్యవసాయంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగు చదివిన ఈయన పుణెలోని ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. అంతా సౌకర్యంగా ఉన్నా చేరిన ఆర్నెల్లకే ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి స్వగ్రామానికి తిరిగొచ్చేశారు. వ్యవసాయంపై ఆసక్తితో యూట్యూబ్ చూసి ఆధునిక సాగులో మెళకువలు నేర్చుకున్నారు. తన కుటుంబానికి చెందిన అయిదెకరాలకు తోడుగా మరో 15 ఎకరాలు లీజుకు తీసుకొని మిరప, టమాటా, బఠాణీ, క్యాబేజీ వంటి వాణిజ్య పంటలు సాగు చేశారు. నిపుణుల సూచనలతో ఆరంభ కష్టాలు అధిగమించి అనతికాలంలోనే లాభాలబాట పట్టారు. ఏడాది వ్యవధిలో 21 టన్నుల మిరపకాయల విక్రయంతోనే రూ.10 లక్షలు వచ్చాయి. ఉదయ్ ఉద్యోగం మానేసి తప్పు చేశాడని మొదట్లో అనుకున్నామని, ఇప్పుడు అతడి నిర్ణయమే సరైనదని అర్థమైందని తల్లి మీరాదేవి అన్నారు. ప్రభుత్వ పథకాలను తెలివిగా సద్వినియోగం చేసుకొన్న ఉదయ్ విద్యావంతులైన యువత వ్యవసాయంలోకి వచ్చేందుకు స్ఫూర్తిగా మారారని జిల్లా వ్యవసాయ అధికారి గౌతమ్ కుమార్ తెలిపారు.
