IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై కేంద్రం చర్యలు.. సీఈఓపై వేటు తప్పదా..?
ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. కొన్ని రోజులుగా కొనసాగుతోన్న సంక్షోభం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితులను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ (IndiGo CEO)ను పదవి నుంచి తొలగించేలా ఇండిగో బోర్డుకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అలాగే ఎయిర్‌లైన్‌పై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమవుతోందని సీనియర్ అధికారుల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఈ రోజు సాయంత్రం ఇండిగో అధికారులను పిలిపించి మాట్లాడనుంది. అలాగే ఆ కంపెనీ విమాన సర్వీసుల్ని తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
అనుకోకుండా ఎదురైన అనేక సవాళ్లు ఈ పరిస్థితికి కారణమని ఇప్పటికే ఇండిగో తెలిపింది. సాంకేతిక సమస్యలు, చలికాలం వల్ల షెడ్యూల్‌లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో ఇబ్బందులు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు (Flight Duty Time Limitations-FDTL) కారణమని వివరణ ఇచ్చింది. ఈ కొత్త నియమాల ప్రకారం పైలట్ల సంఖ్యను సరిగా అంచనావేయకపోవడం వల్లే దేశీయ సర్వీసుల్ని నిర్వహించడంలో ఇబ్బందిపడుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీటీఎల్‌లోని వీక్లీ విశ్రాంతి నిబంధనను తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ప్రభుత్వం నిన్న వెల్లడించింది. ఈ చర్యలతో మూడురోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తోంది.
ఈ అంతరాయాలపై కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మొత్తం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని పౌర విమానయాన శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ సంజయ్ కె బ్రహ్మనే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాన్‌గ్లిక్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ లోకేష్ రాంపాల్ ఉన్నారు. వీరు భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు చోటుచేసుకోకుండా కొన్ని సిఫార్సులు కూడా చేయనున్నారు.
