భారత విదేశాంగ మంత్రిపై పాకిస్థాన్ తీవ్ర విమర్శలు! దౌత్య యుద్ధానికి నాంది?
ఇంటర్నెట్ డెస్క్: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌పై పాకిస్థాన్ (Pakistan) మరోసారి నోరు పారేసుకుంది. పాక్ సైన్యంతోనే భారత్‌కు ఎక్కువ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొనడం సరికాదని తెలిపింది. తమ వ్యవస్థలను, నాయకత్వాన్ని కించపరిచేలా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని ఖండిస్తున్నామని తెలిపింది. సైన్యం సహా వ్యవస్థలన్నీ తమ జాతీయ భద్రతకు మూలస్తంభాలని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ ఆండ్రాబీ పేర్కొన్నారు.
ఓ జాతీయ వార్తా సంస్థ ఇటీవల నిర్వహించిన సమిట్‌లో పాల్గొన్న ఎస్ జైశంకర్‌కు.. పాకిస్థాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆయన బదులిస్తూ.. పాక్ సైన్యంపై విమర్శలు గుప్పించారు. దాని నిజస్వరూపం మనకు తెలుసని.. దానివల్లే మన దేశానికి సమస్యలు వచ్చి పడుతున్నాయని వ్యాఖ్యానించారు. వీటిపైనే దాయాది స్పందిస్తూ మరోసారి అక్కసు వెళ్లగక్కింది.
