Amazon: 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. పది లక్షల ఉద్యోగాలు: అమెజాన్ ప్రకటన
ఇంటర్నెట్‌డెస్క్: 2030 నాటికి భారత్‌లో వివిధ వ్యాపారాల్లో 35 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) వెల్లడించింది. ఉపాధి కల్పన, వ్యాపార విస్తరణ కోసం ఈ ప్రణాళికలను ప్రకటించింది. దిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమిట్‌లో ఈ ప్రకటన చేసింది. గత 15 ఏళ్లలో భారత్‌లో అమెజాన్ 40 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది.
భారతదేశ విస్తృత డిజిటల్, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఎగుమతి వృద్ధి, ఉద్యోగ సృష్టి లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉంటాయని వెల్లడించింది. అమెజాన్ ఇప్పటివరకు 12 లక్షల వ్యాపారాలను డిజిటలైజ్ చేసిందని, 2024లో సుమారు 2.8 మిలియన్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష, సీజనల్ ఉద్యోగాలు లభించాయని పేర్కొంది. 2030 నాటికి అదనంగా 10 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘గత 15 ఏళ్లుగా భారత్ డిజిటల్ ప్రయాణంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మా సంస్థ వృద్ధి.. భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్, వికసిత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. భారత్‌లో చిన్న వ్యాపారాలకు డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించడంలో, లక్షలాది ఉద్యోగాలను సృష్టించడంలో, మేడ్ ఇన్ ఇండియాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే దిశగా మేం భారీగా పెట్టుబడులు పెట్టాం’’ అని అమెజాన్‌లో ఎమర్జింగ్ మార్కెట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ అన్నారు. కొత్త పెట్టుబడుల గురించి ప్రకటన చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
