సోషల్ మీడియా నెటిజన్లకు పోలీసుల హెచ్చరికలు
ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునేవరకు ఎన్నో మెసేజ్ లను చూస్తుంటాం. పంపిస్తుంటాం.. లేదా ఫార్వర్డ్ చేస్తుంటాం. కొన్నిసార్లు ఆ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ల పర్యవసానం గురించి పెద్దగా ఆలోచించం.
నిజం గడపదాటేలోగా అసత్యం ప్రపంచాన్ని చుట్టేసుకుని వస్తుంది అనే సామెతలా నేటి సోషల్ మీడియా వార్తలు ఉంటున్నాయి. ప్రత్యేకంగా ఇటీవల సోషల్ మీడియాలో సత్యవార్తలు కంటే అసత్య వార్తలే హల్ చల్ చేస్తున్నాయి. వాటివల్ల మనతో పాటు ఇతరులకు ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నామని గ్రహించలేనిస్థితిలో ఉన్నాం. అసత్య వార్తల వల్ల మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారి ఆత్మాభిమానం దెబ్బతినేలా కొన్ని కంటెంట్ ఉంటున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలిసులు నెటిజన్లకు కొన్ని హెచ్చరికల్ని జారీ చేస్తున్నారు.
వీటిని గుర్తుంచుకోండి..
- మీరు రాసే వార్త నిజమో కాదో నిర్ధారించుకుని, ఆ తర్వాత దాన్ని ఫార్వర్డ్ చేయాలి.
- వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవు.
- తప్పుడు వార్తల్ని ప్రచారం చేసి, చిక్కుల్లో పడొద్దు.
- తప్పుడు ప్రచారంలో భాగస్వాములు కావొద్దు. అది మీ ప్రతిష్ఠకు భంగం కలిగించవచ్చు.
సెన్సేషనలిజం కోసం పాకులాడుతూ, నవ్వుల పాలు కావద్దు. నెటిజన్ల ఆగ్రహానికి గురికావద్దు. ఫేక్ వార్తల ప్రచారంలో మీరు భాగస్వాములు కాకుండా జాగ్రత్తగా చూసుకోండి…
