Indian Army: ఆర్మీకి ‘అశనీ దళం’ వెన్నుదన్ను.. సైన్యం చేతికి మట్టి అంటకుండా..

ఇంటర్నెట్‌డెస్క్: భారత అమ్ముల పొదిలోకి మరిన్ని అధునాతన సాంకేతిక ఆయుధాలు చేరనున్నాయి. 850 ఆత్మాహుతి డ్రోన్ల (kamikaze) (కాముకాజి) కొనుగోలు ప్రక్రియ తుదిదశలో ఉంది. డిసెంబర్ చివరి వారంలో జరగనున్న రక్షణ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఘటన నేపథ్యంలో.. భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సాంకేతికను అందిపుచ్చుకుంటూ ప్రాణనష్టం జరగకుండా.. శత్రు మూకల్ని అంతం చేసేందుకు వీలుగా ఆత్మాహుతి డ్రోన్లను సమకూర్చుకుంటోంది. కేవలం ఆర్మీలోనే (Indian Army) కాకుండా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనూ ఈ తరహా డ్రోన్ల వాడకాన్ని మరింత పెంచుకోవాలన్న లక్ష్యంతో మొత్తం 30 వేల డ్రోన్లను సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తొలి విడతగా 850 డ్రోన్ల కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది.
ఏంటీ ఆత్మాహుతి డ్రోన్లు?
ఈ ఆత్మాహుతి డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (NAL) అభివృద్ధి చేస్తోంది. వెయ్యి కిలోమీటర్ల దాకా ఎగరగలవు. రాడార్ల కళ్లుగప్పి.. లక్ష్యాలను ఛేదించగలవు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇలాంటి డ్రోన్లను వినియోగిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, దాని మిత్రదేశాల నౌకా దళాలపై దాడులకు జపాన్ తన యుద్ధవిమానాలను ఆత్మాహుతి దాడులకు వాడింది. వారిని కాముకాజి ఆత్మాహుతి దళాలుగా పిలిచేవారు. ఈ తరహాలోనే డ్రోన్‌లు పనిచేయనున్నాయి.
ఆర్మీకి వెన్నుదన్నుగా అశనీ దళం!
భారత పదాతి దళం ఈ రకం డ్రోన్ల వినియోగాన్ని గణనీయంగా పెంచాలని భావిస్తోంది. క్రమంగా వీటిని ఎయిర్‌ఫోర్స్, నేవీలోనూ వినియోగించేందుకు అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే వీటిని ఒక్కొక్కటిగా ప్రయోగిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక్కో ప్లాటూన్‌లో కనీసం 10 డ్రోన్లు ఉంటాయి. దీనిని అశనీ (Ashni) దళంగా ఆర్మీ చెబుతోంది. వీటన్నింటినీ ఒకేసారి గుంపుగా ప్రయోగిస్తారు. వీటిలో కొన్ని నిఘా కోసం పని చేయగా.. మిగతా డ్రోన్లు శత్రు లక్ష్యాలను ఛేదిస్తాయి. పేలుడు పదార్థాలు మోసుకెళ్తున్న డ్రోన్లు.. శత్రు రాడార్లకు దొరక్కుండా నిఘా డ్రోన్లు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తాయి. సరైన అవకాశం లభించే వరకు వేచి చూసి దాడి చేయడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. వీటి పని తీరును తెలుసుకునేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లో సైన్యం ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించింది.
ఆపరేషన్ సిందూర్ ప్రేరణగా..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్.. క్షిపణులతో పాక్ భూభాగంపై విరుచుకుపడింది. పలు స్థావరాలను నేలమట్టం చేసింది. దాడికి పాల్పడినట్లు భావించిన 9 మంది ఉగ్రవాదుల్లో ఏడుగురిని ఒకే రోజు హతమార్చింది. భారత్‌ను అడ్డుకునే సత్తా లేని పాకిస్థాన్.. సామాన్యులే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. వీటిని భారత్ సమర్థంగా అడ్డుకున్నప్పటికీ.. భవిష్యత్‌లో వాటి ముప్పును అధిగమించేందుకు వీలుగా డ్రోన్ శక్తిని గణనీయంగా పెంచుకుంటోంది.
