Long-Distance Relationship: లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్.. హాయ్ – బాయ్‌తో సరిపెట్టొద్దు
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగాల నిమిత్తం వేర్వేరుగా దూర ప్రాంతాల్లో ఉండే భార్యాభర్తలు, ప్రేమికులు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తుంటారు. కలిసి ఉండే జంటల కన్నా.. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండేవాళ్ల బంధం కాస్త భిన్నమనే చెప్పాలి. రోజూ ఒకరినొకరు నేరుగా చూసుకోలేరు. కలిసి కాసేపు సమయం కేటాయించుకోలేరు. దగ్గరగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొనే అవకాశమూ ఉండదు. దీంతో వీరి మధ్య మనస్పర్థలు, గొడవలు వస్తుంటాయి. మరి అలాంటివి జరగకుండా.. ఈ బంధాన్ని సంతోషంగా కొనసాగించాలంటే.. ఫోన్లో హాయ్-బాయ్‌తో సరిపెట్టొద్దు.. ఈ టిప్స్ ఫాలో అయితే బెటర్.
- మొబైల్ దగ్గర ఉంటే ప్రియమైన వ్యక్తి దగ్గర ఉన్నట్లే ఫీల్ అయ్యే రోజులివీ. ఫోన్లో రోజూ కాసేపు మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలను సైతం పంచుకుంటే ఆ ఆనందమే వేరు. అనుభవాలు, ఆలోచనలు, ఫీలింగ్స్‌ను ఒకరికొకరు పంచుకుంటే దూరంగా ఉన్నామన్న భావన కలగదు.
- కుటుంబ వ్యవహారాలు చర్చించాలి. వారి అవసరాలను, సమస్యలను తరచూ అడిగి తెలుసుకుంటూ పరిష్కారాలు సూచించాలి. పుట్టిన రోజులు, పండగల రోజున కలిసే ప్రయత్నం చేయాలి.
- ఇద్దరూ పిచ్చాపాటిగా మాట్లాడుకోడానికి ఒక సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఉదయం వ్యాయామం/బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ, ఆఫీసులో విధులు ముగించుకున్న తర్వాత, రాత్రి నిద్రపోయే ముందు ఇలా ఓ సమయం పెట్టుకొని మాట్లాడాలి.
- దూరంగా ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు బిజీగా ఉంటారో తెలుసుకోవడం కష్టం. ఆఫీసు పని, మీటింగ్స్‌తో బిజీగా ఉండొచ్చు. కుటుంబసభ్యులతో, స్నేహితులతో ఉండటం వల్ల మాట్లాడకపోవడం కుదరకపోవచ్చు. ఆ పరిస్థితుల్ని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.
- రోజూ మాట్లాడే వ్యక్తి అకస్మాత్తుగా మాట్లాడటం ఆపేస్తే దూరం పెడుతున్నారేమోనన్న ఆలోచన ఎదుటి వ్యక్తికి వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితిని రానివ్వొద్దు. ఏవైనా పనులు ఉంటే ముందుగానే వివరించి అందుబాటులో ఉండనని చెప్పడం మంచిది.
- ఒకరిపై మరొకరికి నమ్మకం ముఖ్యం. అది కోల్పోకుండా చూసుకునే బాధ్యత ఇరువురిపైనా ఉంటుంది. ఒకరికి మనసు ఇచ్చాక.. వాళ్లు దగ్గర లేరని మరో బంధం కోసం చూడొద్దు. ఇద్దరూ నిజాయతీగా ఉండాలి. అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి.
- రోజూ ప్రియమైన వ్యక్తిని చూస్తూ ఉండటంలో ఉండే ఫీలింగే వేరు. నేరుగా కలవకపోయినా వీడియో కాల్స్ ద్వారా చూసుకునే వెసులుబాటు ఉంది. అప్పడప్పుడు వీడియోకాల్ ద్వారా మాట్లాడుతూ.. ప్రేమను వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది.
- కలిసే అవకాశం వస్తే అస్సలు వదులుకోకండి. కలిసిన సమయాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చండి. నేరుగా ప్రేమను వ్యక్తపర్చండి. భవిష్యత్తుపై ప్రణాళికలు వేసుకోండి. కలిసి ఉండే మార్గాల గురించి చర్చించుకోండి.
- సంతోషమైనా, బాధయినా ప్రియమైన వ్యక్తులతోనే పంచుకుంటే ఆ బంధం మరింత బలపడుతుంది. సంతోషాన్ని పంచుకోవడమే కాదు.. బాధలో ఉన్నప్పుడు అండగా నిలబడాలి. సమస్యలు వస్తే పరిష్కరించడంలో సాయపడాలి.
- వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వడం తప్పనిసరి. ఒకరు ఏం చేయాలో మరొకరు నిర్ణయించకూడదు. ఎవరికి నచ్చినట్టుగా వారు ఉంటూనే ఎదుటి వ్యక్తి నిర్ణయాలు, అభిప్రాయాలను గౌరవించాలి. విభేదాలు వస్తే సామరస్యంగా మాట్లాడుకోవాలి.
- ప్రేమికుల మధ్య గొడవలు సహజమే. అయితే, చాటింగ్ రూపంలో వాదనలు చేయకూడదు. మనిషి భావోద్వేగాలు ఎలా ఉన్నాయో చాటింగ్‌లో వ్యక్తపర్చడం కష్టం. అందుకే, ఫోన్లో లేదంటే నేరుగా కలిసి సమస్యను పరిష్కరించుకోవాలి.
- దగ్గరగా ఉండే భాగస్వామిని కలవడం కోసం, వారితో ఉండటం కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అదే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఆ అవకాశం ఉండదు. అలా లభించే ఖాళీ సమయాన్ని వ్యక్తిగత ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. కెరీర్, అభిరుచిపై మరింత శ్రద్ధ పెట్టాలి.
- ఏ బంధమైనా ముందుకుసాగాలంటే ప్రయత్నం ఇరువైపులా ఉండాలి. ఒక్కరు ప్రయత్నిస్తూ, మరొకరు ఎలాంటి స్పందన లేకుండా ఉంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. ఈ విషయాలను గుర్తుంచుకుంటే.. బంధం సంతోషంగా కొనసాగుతుంది.
