దారికాచిన మృత్యువు
రంపచోడవరం, రాజోలు, కాట్రేనికోన: రంపచోడవరం మండలం ఐ.పోలవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు మృతి చెందారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రుకు చెందిన విద్యాసాగర్(38), పిగన్నవరం మండలం చాకలిపాలేనికి చెందిన గెడ్డం సందీప్(34) చింతూరు మండలంలో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్నారు. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు బుధవారం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. పాలకాలువ దాటిన తర్వాత ఆగి ఉన్న కారును ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికీ కాళ్లు, చేతులు విరిగిపోవడంతోపాటు తలకు గాయాలయ్యాయి. రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సందీప్ అక్కడే మృతిచెందారు. విద్యాసాగర్‌ను రాజమహేంద్రవరం తరలిస్తుండగా గోకవరం సమీపంలో మృతిచెందారు.
మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతి..
సందీప్ రాజోలు మండలం బి.సావరం పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. మూడు నెలల క్రితం ఉద్యోగోన్నతిపై చింతూరు మండలం వెళ్లారు. తండ్రి చనిపోవడంతో అన్నీతానై కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తల్లి ఉపాధి రీత్యా ఇతర దేశంలో ఉంటూ ఇటీవలే స్వగ్రామం వచ్చారు. ఇతని మృతితో చాకలిపాలెం, బి.సావరంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇటీవలే కుమారుడి జననం
పల్లంకుర్రులోని చీకురుమెల్లివారిపేటకు చెందిన పి.విద్యాసాగర్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మహాలక్ష్మి, శ్రీరాములు దంపతుల నలుగురు కుమారుల్లో విద్యాసాగర్ చివరివాడు. 2019లో సచివాలయ గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిగా మండలంలోని కుండలేశ్వరంలో విధుల్లో చేరాడు. ఏడాది క్రితం ఉద్యోగోన్నతిపై చింతూరు మండలం సీతనపల్లి పంచాయతీ కార్యదర్శిగా వెళ్లాడు. భార్య మహిళా పోలీసుగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు మూడు నెలల క్రితం రెండో కుమారుడు జన్మించాడు.
