ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై GHMC బంపర్ ఆఫర్.. 90 శాతం వడ్డీ మాఫీతో వన్ టైమ్ సెటిల్మెంట్..
భాగ్యనగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) శుభవార్త చెప్పింది. మహానగర పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై ఒకేసారి పరిష్కారం (వన్ టైమ్ సెటిల్మెంట్) అవకాశం కల్పిస్తూ.. పెండింగ్ వడ్డీపై భారీ రాయితీని ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులపై ఉన్న బకాయిలకు సంబంధించి 90 శాతం వడ్డీ మాఫీ లభించనుంది. వినియోగదారులు అసలు ప్రాపర్టీ ట్యాక్స్‌తో పాటు కేవలం 10 శాతం వడ్డీని మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలంగా ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలతో ఇబ్బంది పడుతున్న ఆస్తి యజమానులకు పెద్ద ఊరట లభించనుంది. గతంలో వడ్డీ భారంతో పన్ను చెల్లించేందుకు వెనుకడుగు వేసిన వారు ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, అద్దె ఇళ్ల యజమానులు ఈ పథకంతో లాభపడతారని అంచనా వేస్తున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లింపుపై వడ్డీ రాయితీ కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలను ఒకేసారి చెల్లిస్తే, వాటిపై విధించిన వడ్డీలో 90 శాతం వరకు రాయితీ లభించనుంది.
ఆస్తి యజమానులు అసలు పన్నుతో పాటు కేవలం 10 శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిలను వసూలు చేయడంతో పాటు, పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.ఈ వన్ టైమ్ స్కీమ్‌ను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కూడా సూచించారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధి మరింతగా విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న 20 పురపాలక సంఘాలు, ఏడు నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విస్తరణ ద్వారా కొత్తగా చేరిన ప్రాంతాలపై కూడా జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ విధానం వర్తించనుంది. ఈ లెక్కన జీహెచ్ఎంసీకి గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశాలు పెరిగాయని అధికారులు భావిస్తున్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ బకాయిలను సకాలంలో పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.
జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత వేగంగా పూర్తి చేసింది. నవంబర్ 25న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహానగర విస్తరణకు ఆమోదం లభించగా, డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందించారు. గవర్నర్ వెంటనే ఆ చట్టానికి ఆమోద ముద్ర వేయడంతో డిసెంబర్ 2న మొత్తం 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ విస్తరణతో జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతంలో ఉన్న 150 కార్పొరేటర్ స్థానాలను 300కు పెంచుతూ ప్రభుత్వం డీలిమిటేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ప్రజలకు మరింత సమీపంగా పరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.క్లుప్తంగా చెప్పాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ వడ్డీపై భారీ మాఫీతో పాటు జీహెచ్ఎంసీ విస్తరణ నిర్ణయాలు నగర పాలనను బలోపేతం చేయడంలో కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
