ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ పేరు మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 28:
కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తెలంగాణ కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGS) పేరును మార్చే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుపట్ల ద్వేషభావంతో వ్యవహరిస్తోందని, ముఖ్యంగా బలహీన వర్గాలకు మేలు చేసే సంక్షేమ పథకాల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపుతోందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కోట్లాది మందికి ఉపాధి భరోసా లభిస్తున్నదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేసిన మంత్రి, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జనవరి 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
అలాగే, కొత్త బిల్లుతో పథక వ్యయంలో సుమారు 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల బకాయిలను సకాలంలో విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని, దీని వల్ల రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
ఇంకా, రాష్ట్రాల అప్పులపై ఎఫ్‌ఆర్‌బీఎం (FRBM) పరిమితులు విధించడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను కేంద్రం కట్టడి చేస్తున్నదని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ లబ్ధిదారులకు పథక ప్రయోజనాలు నిరంతరం అందించడం కష్టతరమవుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు.
