Unnao rape case: ‘అతడికి మరణశిక్షపడేవరకు నా పోరాటం ఆగదు..’: ఉన్నావ్ అత్యాచార బాధితురాలు
ఇంటర్నెట్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సెంగర్ జైలు శిక్షను సస్పెండు చేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సోమవారం సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై బాధితురాలు మీడియాతో మాట్లాడారు. సెంగర్‌కు ఉరిశిక్ష పడేవరకు తన పోరాటం ఆగదని వెల్లడించారు. అప్పుడే తన తండ్రికి, తనకు న్యాయం జరుగుతుందన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంపై అపార విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు (Unnao rape case).
2017లో కుల్దీప్ సింగ్ సెంగర్ ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh News)లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై (Unnao rape case) అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు, సంబంధిత ఇతర కేసులను ఉత్తరప్రదేశ్‌లోని ట్రయల్ కోర్టు నుంచి దిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసుపై ఇటీవల విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు సెంగర్ శిక్షను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బాధితురాలు, మహిళా సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ఈ తీర్పుపై బాధితురాలి తరఫు న్యాయవాదులు, సీబీఐ అధికారులు సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ఊరట లభించిన సంగతి తెలిసిందే.
సెంగర్ కుమార్తె బహిరంగ లేఖ..
మరోవైపు.. తన తండ్రికి న్యాయం కావాలని కోరుతూ సెంగర్ (Kuldeep Sengar) కుమార్తె ఇషిత ఎక్స్ వేదికగా బహిరంగ లేఖ విడుదల చేశారు. తన తండ్రి ఎదుర్కొంటోన్న విచారణ కారణంగా తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఒక కూతురిగా ఎంతో అలసిపోయానని, ఇంకా చిన్న ఆశ ఏదో మిగిలివుందని రాసుకొచ్చారు.
