US వీసా రూల్స్ భయం: ఇళ్లకే పరిమితమైన వలసదారులు
అమెరికాలో ఇప్పుడు క్రిస్మస్, న్యూఇయర్ హాలీడే సీజన్ సందర్భంగా ప్రయాణాల రద్దీ విపరీతంగా ఉంటుంది. వరుస సెలవులతో అనేక మంది పర్యటనలకు మొగ్గు చూపుతుంటారు. అయితే, ట్రంప్ వీసా రూల్స్ పుణ్యమా అని వలసదారులు (Immigrants in US) మాత్రం ఇళ్లకే పరిమితమవుతున్నారు. కఠిన ఇమిగ్రేషన్ నిబంధనల నేపథ్యంలో ప్రయాణాలంటేనే ‘వద్దు బాబోయ్’ అంటూ భయపడుతున్నారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు సహా అనేకమంది వలసదారులు తమ ప్రయాణాలను మానుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్, కేఎఫ్‌ఎఫ్ సర్వేలో వెల్లడైంది.
ఇమిగ్రేషన్ (US Immigration) అధికారుల దృష్టిలో పడకూడదనే ఉద్దేశపూర్వకంగా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నామని ప్రతి 10 మందిలో ముగ్గురు విదేశీ వలసదారులు చెప్పినట్లు సర్వే వెల్లడించింది. హెచ్-1బీ వీసాదారుల్లో 32శాతం మంది, అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో 15శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు సర్వే తెలిపింది. ఇక, సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో అయితే ఏకంగా 63శాతం మంది బయటకు ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉంటున్నారట..!
విదేశీ ప్రయాణాలు మాత్రమే కాదు.. అమెరికాలోనూ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వలసదారులు ఇష్టపడటం లేదని సర్వే తెలిపింది. హెచ్-1బీ సహా పలు వీసాలకు సంబంధించి నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఇటీవల పలు టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు సూచించాయి.
