కిలో బియ్యం రూపాయి..ఆటోకు రూ.50 కిరాయి
ఐదోనాల్‌తండా వాసులురేషన్ సరకులు తెచ్చుకుంటున్న దృశ్యం
భువనగిరి, ఆలేరు, సంస్థాన్ నారాయణపురం, అడ్డగూడూరు, బొమ్మలరామారం, న్యూస్‌టుడే: జిల్లాలో సరిపడా రేషన్ దుకాణాలు లేక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం కిలో రూపాయికే బియ్యం ఇస్తున్నా దుకాణం లేకపోవడంతో ఆటోలో వెళ్లి తెచ్చుకోవడానికి రూ.50 నుంచి రూ.100 ఖర్చు చేయాల్సి వస్తుంది.
- జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ఉన్నాయి. కొత్తగా 33 వేలకు పైగా రేషన్ కార్డులు జారీ చేయడంతో వాటి సంఖ్య 2,48,757కు పెరిగాయి. 90 రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండేళ్లుగా భర్తీ చేయడం లేదు. కలెక్టర్ హనుమంతరావు జోక్యం చేసుకుని ఇటీవల రెండు మూడు చోట్ల సబ్ సెంటర్లు ఏర్పాటు చేయించారు.
- సంస్థాన్ నారాయణపురం మండలం ఐదోనాల్‌తండాలో చౌకధరల దుకాణం లేదు. గిరి‘జనం’ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కడీలబావితండాకు వెళ్లి రేషన్ తెచ్చుకుంటారు. అల్లందేవిచెర్వు గ్రామస్థులు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్వేల్ గ్రామానికి వెళ్లి సరకులు తెచ్చుకుంటారు.
- ఆలేరు మండలంలో కందిగడ్డతండా పంచాయతీ ఏర్పడి ఏడున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ దుకాణాలు ఏర్పాటు కాలేదు. నాలుగు కి.మీల దూరంలోని గుండ్లగూడేనికి వెళ్లాల్సి వస్తోంది.
- బొమ్మలరామారం మండలం రాంలింగంపల్లి, మర్యాల, చీకటిమామిడి, బొమ్మలరామారం, తిమ్మాపూర్ గ్రామాల్లోనే దుకాణాలు ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల వినియోగదారులు ప్రతినెలా అవస్థలు పడుతూ పక్క గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.
- అడ్డగూడూరు మండలంలోని కొండంపేట గ్రామస్థులు ఐదు కిలోమీటర్ల దూరంలోని అజీంపేటకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది.
నడిచి వెళ్లలేకపోతున్నాం
రేషన్ బియ్యం మా ఊళ్లోనే ఇవ్వాలి. నాలుగు కిలోమీటర్ల దూరంలోని అజీంపేటకు వెళ్లాలంటే పని మానుకోవాల్సి వస్తోంది. ఏళ్లు గడుస్తున్నప్పటికీ గ్రామంలో రేషన్‌దుకాణం ఏర్పాటు కావడం లేదు.
