Deepinder Goyal: ‘నెలకు ₹21 వేలు సంపాదన’.. గిగ్ మోడల్‌ను వెనకేసుకొచ్చిన దీపిందర్ గోయల్
Deepinder Goyal on Gig work model | ఇంటర్నెట్ డెస్క్: జొమాటో, బ్లింకిట్ సంస్థల వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ (Deepinder Goyal) గిగ్ వర్క్ మోడల్‌ను మరోసారి వెనకేసుకొచ్చారు. వర్కర్ల వేతనం, పని పరిస్థితులపై వరుస పోస్టులు పెట్టారు. ఇటీవల గిగ్ వర్కర్ల సమ్మెలో భాగంగా 10 నిమిషాల డెలివరీ సేవలను రద్దు చేయాలన్న డిమాండ్ వినిపించింది. దీనిపై శుక్రవారం తన ఎక్స్ పోస్ట్‌లో సమర్థించుకున్నారు. తక్కువ వేతనం, సామాజిక భద్రత వంటి అంశాలూ చర్చకు రాగా.. ఆయా అంశాలపై తాజాగా వివరణ ఇస్తూ వరుస పోస్టులు పెట్టారు.
నెలకు రూ.21 వేలు
జొమాటోలో 2025లో డెలివరీ పార్ట్‌నర్ సగటు వేతనం రూ.102గా ఉందని దీపిందర్ పేర్కొన్నారు. 2024లో ఈ మొత్తం రూ.92 ఉండగా.. ఏడాదిలో 10.9 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. డెలివరీ పార్ట్‌నర్లలో చాలామంది నెలలో కొన్ని రోజులు, కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తారని చెప్పారు. ఒకవేళ రోజుకు 10 గంటలు చొప్పున నెలలో 26 రోజులు పనిచేసినా ఒక్కో డెలివరీ ఏజెంట్ రూ.26,500 ఆర్జించొచ్చని, అందులోంచి పెట్రోల్, నిర్వహణ ఖర్చులు మినహాయించినా రూ.21వేలు వస్తుందని పేర్కొన్నారు. దీనికి టిప్ అదనం అని చెప్పారు.
ఏడాదికి 38 రోజులే
ఫుల్ టైమ్ వర్క్‌కు ప్రత్యామ్నాయంగా గిగ్ వర్క్ మోడల్ రూపుదిద్దుకుందని దీపిందర్ పేర్కొన్నారు. అధిక పని గంటల ప్రసక్తే ఉండబోదని చెప్పారు. 2025లో డెలివరీ పార్ట్‌నర్లు సగటున 38 రోజులు, రోజుకు, ఏడేసి గంటలు మాత్రమే పనిచేశారని పేర్కొన్నారు. మొత్తం డెలివరీ పార్ట్‌నర్లలో 2.3 శాతం మంది మాత్రమే ఏడాదిలో 250 కంటే ఎక్కువ రోజులు పని చేశారని చెప్పారు. అలాంటప్పుడు పూర్తిస్థాయి ఉద్యోగితో సమానంగా ప్రయోజనాలు, స్థిరమైన వేతనాలు కోరడం ఈ మోడల్‌కు ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. ఫలానా చోటే పనిచేయాలని గానీ, ఫలానా షిఫ్ట్‌లోనే చేయాలన్న డిమాండ్ కూడా లేదని గుర్తు చేశారు.
గంటకు 16 కిలోమీటర్ల వేగమే
10 నిమిషాల డెలివరీ హామీ వల్ల డెలివరీ ఏజెంట్లు ప్రమాదాల బారిన పడతారన్న వాదనలనూ కొట్టి పారేశారు. ఆర్డర్ చేసిన ప్రదేశం నుంచి బ్లింకిట్ 2 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంటోందని దీపిందర్ పేర్కొన్నారు. దీంతో 8 నిమిషాల్లో డెలివరీ సాధ్యమవుతోందని, ఈ లెక్కన డెలివరీ ఏజెంట్లు ప్రయాణించేది గంటకు సగటున 16 కిలోమీటర్ల వేగంతోనే అని వివరించారు.
రూ.100 కోట్లు ఖర్చు
2025లో డెలివరీ భాగస్వాముల బీమా కోసం జొమాటో, బ్లింకిట్ సంయుక్తంగా రూ.100 కోట్లు పైనే ఖర్చు చేశాయని దీపిందర్ తెలిపారు. ఒక్కో డెలివరీ పార్ట్‌నర్‌కు రూ.10 లక్షల ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తున్నట్లు చెప్పారు.
అదనంగా ఇవీ..
మహిళా డెలివరీ ఏజెంట్లకు నెలకు వేతనంతో కూడిన రెండు విశ్రాంత సెలవులు ఇస్తున్నామని దీపిందర్ తెలిపారు. ట్యాక్స్ ఫైలింగ్‌లో సహకారం, ఎన్‌పీఎస్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. 95 వేల మంది ట్యాక్స్ ఫైలింగ్ సదుపాయాన్ని వినియోగించగా.. 54 వేల మంది పెన్షన్ స్కీమ్‌కు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇన్ని కల్పిస్తున్నా గిగ్ వర్కర్ల పని పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తంచేయడం సమంజసమా? అని దీపిందర్ ప్రశ్నించారు.
