AI Grok feature: గ్రోక్‌లో ‘ప్రమాదకర ట్రెండ్’పై మహిళా ఎంపీ ఆందోళన.. కేంద్రానికి లేఖ
AI Grok feature | ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ (Grok) మరోసారి వివాదంలో చిక్కుకుంది. అసభ్య పదాలు, తిట్లతో విరుచుకుపడుతున్నట్లు గ్రోక్‌పై ఆరంభంలో విమర్శలు వచ్చాయి. రాజకీయంగానూ పక్షపాతంగా ఉందన్న ఆరోపణలూ వినిపించాయి. తాజాగా ఓ కొత్త ట్రెండ్ కారణంగా గ్రోక్ మరోసారి వార్లల్లో నిలిచింది. సాధారణ మహిళ ఫొటోను అశ్లీలంగా మార్చాలని ప్రాంప్ట్ ఇవ్వడం, దానికి గ్రోక్ సంకోచం లేకుండా సమాధానం ఇస్తుండడం వివాదాస్పదమవుతోంది. దీంతో మహిళల మార్ఫింగ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. మహిళల గోప్యతకు సంబంధించిన ఈ అంశంపై తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
‘‘సామాజిక మాధ్యమాల్లో, ముఖ్యంగా ఎక్స్‌లో నడుస్తున్న అసభ్యకర ట్రెండ్ గురించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ఏఐ గ్రోక్‌ను ఉపయోగించి కొందరు మహిళల చిత్రాలను మార్ఫ్ చేస్తున్నారు. మహిళల ఫొటోలను అశ్లీలంగా మార్చాలని గ్రోక్‌కు ప్రాంప్ట్ ఇచ్చి.. వచ్చిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఏఐని ఇలా దుర్వినియోగం చేయడం సరికాదు. గ్రోక్ కూడా ఇలాంటి ప్రాంప్ట్‌లను అంగీకరిస్తోంది. ఇది మహిళల భద్రతకు, వారి హక్కులకు భంగం కలిగిస్తోంది. ఇది కేవలం అనైతికమే కాదు.. నేరం కూడా’’ అని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
రిమూవ్ దిస్ పిక్చర్
మరోవైపు గ్రోక్‌లో ‘రిమూవ్ దిస్ పిక్చర్’ పేరిట మరో ట్రెండ్ మొదలైంది. కొందరి వ్యక్తుల ఫొటోలు ఇచ్చి వీరిలో ‘అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని తొలగించు’ లేదా ‘వీరిలో నటన రాని వ్యక్తులను మాత్రమే ఉంచు’ వంటి ప్రాంప్ట్‌లు ఇస్తున్నారు. దీనిపై గ్రోక్ ఇచ్చిన సమాధానాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌తో ఏకీభవించేవారు, విభేదించిన వారి మధ్య కామెంట్ల రూపంలో మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ట్రెండ్‌కు మహాత్మ గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, డొనాల్డ్ ట్రంప్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి రాజకీయ, సినీ ప్రముఖులూ బాధితులే కావడం కొసమెరుపు.
సామాజిక మాధ్యమాలదే బాధ్యత: అశ్వినీ వైష్ణవ్
గ్రోక్ ఏఐ జనరేట్ చేస్తున్న చిత్రాలకు సంబంధించి వస్తోన్న ఫిర్యాదులపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. తమ ప్లాట్‌ఫామ్‌లలో పోస్టయ్యే వాటికి ఆయా సామాజిక మాధ్యమాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వేదికల జవాబుదారీతనంపై స్టాండింగ్ కమిటీ కూడా ఇప్పటికే కఠిన చట్టాన్ని సిఫార్సు చేసిందన్నారు. అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై చర్యలు తీసుకోవడంలో విఫలమైతే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని సోషల్ మీడియా సంస్థలను హెచ్చరించారు. వీటికి సంబంధించి ఐటీ శాఖ ఇటీవల అడ్వైజరీ జారీ చేసిన విషయం తెలిసిందే.
