Kishan Reddy: కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.. కిషన్‌రెడ్డి ఫైర్
ఢిల్లీ, జనవరి3 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (PM Narendra Modi) సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు హేయమైనవని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, దేశాభివృద్ధికి అహోరాత్రులు కష్టపడుతూ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని దార్శనిక నాయకుడు మోదీ పెంచుతున్నారని అన్నారు. అలాంటి వ్యక్తిపై ప్రజాప్రతినిధి అయిన కూనంనేని.. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు కిషన్‌రెడ్డి.
మోదీపై కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెట్టాయని విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరమని చెప్పుకొచ్చారు. అంతేకానీ ప్రధానమంత్రిపై వ్యక్తిగత ధూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తుంటారనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో వారికి ప్రజాస్వామ్య విలువలపై, రాజకీయ వ్యవస్థపై ఏవగింపు కలుగుతోందని తెలిపారు. మోదీపై వ్యాఖ్యలకు గానూ కూనంనేని సాంబశివరావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ విషయంపై వెంటనే జోక్యం చేసుకుని మరెవరూ.. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయకుండా, సభా మర్యాదలు పాటించేలా చొరవ తీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు.
