Minister Komatireddy : సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశా.. టికెట్ల ధరల పెంపు జీవోలతో నాకు సంబంధం లేదు!
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా టికెట్ల ధరల పెంపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పెద్ద సినిమాల విడుదల వేళ.. టికెట్ రేట్ల పెంపు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి క్లారిటీ ఇచ్చారు. శనివారం ( జనవరి 10, 2026 ) విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రేట్ల వ్యవహారాలను తాను పట్టించుకోవడం మానేశానని స్పష్టం చేశారు.
టికెట్ల పెంపు.. నా సంతకం లేదు!
గత కొంతకాలంగా పెద్ద సినిమాల విడుదలకు ముందు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవోలు జారీ చేస్తోంది. అయితే, ఈ ప్రక్రియతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు. ‘పుష్ప 2’ సినిమా విడుదల సమయం నుంచే నేను చెబుతున్నాను. బెనిఫిట్ షోలు లేదా రేట్ల పెంపు ఫైళ్లు నా దగ్గరకు తీసుకురావద్దని అధికారులకు స్పష్టం చేశాను. ప్రస్తుతం సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఏ ఫైలు కూడా నా వద్దకు రాలేదు, నేను దేనిపైనా సంతకం చేయలేదు అని ఆయన విలేకరుల సమావేశంలో స్పష్టంచేశారు.
సంధ్యా థియేటర్ ఘటనతో కలత..
అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒక మహిళ మరణించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి అన్నారు. ఆ ఘటన తర్వాత బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎందుకు ఇచ్చానా అనిపించింది. అందుకే ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రమాదంలో బాధితులకు ప్రతీక్ ఫౌండేషన్ తరపున రూ. 25 లక్షల చెక్ అందించాం. గాయపడిన బాలుడిని చదివించే బాధ్యతను కూడా తీసుకున్నాను అని కోమటిరెడ్డి వివరించారు.
సినిమా టికెట్ల ధరల పెంపు అనేది సామాన్య ప్రేక్షకుడిపై భారం మోపడమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. పేద కళాకారులు, సినిమా కార్మికుల సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరిస్తానని, కానీ కేవలం లాభాల కోసం రేట్లు పెంచే అంశాల్లో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. నా సొంత నియోజకవర్గం నల్గొండ అభివృద్ధి పనులపై దృష్టి సారించాను. సినీ పరిశ్రమ రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాను అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మంత్రి వ్యాఖ్యలతో ఇప్పుడు టాలీవుడ్లో మరో సారి చర్చనీయాంశంగా మారింది
