Special Drive On China Manja: భారీగా చైనీస్ మాంజా సీజ్.. 57 మంది అరెస్ట్
హైదరాబాద్: దేశంలో చైనా మాంజాపై నిషేధం విధించినప్పటికీ.. వీటి అమ్మకాలు ఇంకా జరుగుతునే ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తూ ఆనందిస్తున్న సమయంలో ఈ చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఈ చైనీస్ మాంజా కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ వ్యాప్తంగా చైనీస్ మాంజా నిషేధానికి పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. జనవరి 8 నుంచి 11 వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పోలీసులు రూ.43 లక్షల విలువైన 2,150 బాబిన్లు సీజ్ చేసి.. 57 మందిని అరెస్ట్ చేశారు. నిషేధిత మాంజా విక్రయంపై 29 కేసులు నమోదు చేశారు. గత 30 రోజులలో 132 కేసులు నమోదు చేసి, రూ.1.68 కోట్ల విలువైన 8,376 బాబిన్ల చైనీస్ మాంజా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనల్లో 200 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
కాగా.. చైనా మాంజా అంటే నైలాన్ లేదా సింథటిక్ దారానికి గాజు, లోహపు పొడుల వంటి పదునైన పదార్థాలను పూతగా వేసి తయారుచేసే ప్రమాదకరమైన దారం. ఇది సంప్రదాయ పత్తి దారంతో రూపొందించిన మాంజా కంటే చాలా పదునుగా బలంగా ఉంటుంది. అయితే.. ఇది పర్యావరణానికి హానికరం. మనుషులకు, పక్షులకు, జంతువులకు గాయాలు చేసి, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా కలిగిస్తోంది. అందుకే చైనీస్ మాంజా విక్రయాలపై నిషేధం విధించారు. ఈ కారణంగా సంక్రాంతి పండుగ వేళ వీటి విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు.
