యాదాద్రి జిల్లాలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ ఫ్రాడ్.. ఐదేళ్లలో 1,367 కేసులు, రూ.4.96 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం
- లిస్ట్ పంపించిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్
- తహసీల్దార్లతో కలెక్టర్ స్పెషల్ మీటింగ్
- 2020 నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పరిశీలన
- 2021 ఫిబ్రవరి నుంచి 2026 జనవరి 5 వరకు రూ. 4.96 కోట్ల ఫ్రాడ్ జరిగినట్లు గుర్తింపు
- పోలీసుల అదుపులో మరో నలుగురు నిర్వాహకులు, పరారీలో ఇద్దరు
యాదాద్రి:
డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్‌లో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన భారీ అవినీతి లెక్కలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జనగామ జిల్లాలో ఇదే తరహా అవినీతి బయటపడడంతో రంగంలోకి దిగిన నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌ఐసీ) ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన అన్ని లావాదేవీలను పరిశీలించింది.
ఈ పరిశీలనలో గత ఐదేళ్లలో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,367 డాక్యుమెంట్లలో ఫ్రాడ్ జరిగినట్లు తేలడంతో సంబంధిత లిస్టును జిల్లా అధికారులకు పంపించింది. 2021 ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది జనవరి 5 వరకు స్లాట్ బుకింగ్ అవినీతి కొనసాగినట్లు ఎన్‌ఐసీ గుర్తించింది. ఈ వ్యవహారం బయటపడడంతో కొందరు ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు పరారీలో ఉండగా, మరికొందరిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తహసీల్దార్లతో అత్యవసర సమావేశం
స్లాట్ బుకింగ్ అవకతవకలకు యాదాద్రి జిల్లాలోని వ్యక్తులే ప్రధాన కారణమని తేలడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్‌ఐసీ నుంచి లిస్టు అందిన వెంటనే జిల్లా కలెక్టర్ హనుమంతరావు 17 మండలాల తహసీల్దార్లను పూర్తి వివరాలతో కలెక్టరేట్‌కు హాజరుకావాలని ఆదేశించారు.
దీంతో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం కొనసాగింది. విచారణాధికారులుగా నియమితులైన ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి డాక్యుమెంట్ల వారీగా వివరాలను సేకరించారు.
రూ.4.96 కోట్ల మేర అవినీతి
ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువల ప్రకారం యాదాద్రి జిల్లాలో ఎకరం భూమి ధర రూ.2.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంది. ఈ లెక్కన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
అవినీతి జరిగినట్లు గుర్తించిన 1,367 రిజిస్ట్రేషన్లకు గాను ప్రభుత్వ ఖజానాలో రూ.5,49,81,004 జమ కావాల్సి ఉండగా, కేవలం రూ.57,34,123 మాత్రమే చెల్లించారు. ఈ లెక్కన యాదాద్రి జిల్లాలోనే రూ.4.96 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.
రాజాపేటలోనే అత్యధిక ఫ్రాడ్
జిల్లాలోని రాజాపేట మండలంలోనే అత్యధికంగా అవినీతి జరిగినట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయి. మొత్తం 1,367 ఫ్రాడ్ డాక్యుమెంట్లలో 372 డాక్యుమెంట్లు రాజాపేట మండలానికే చెందినవి కావడం గమనార్హం.
చౌటుప్పల్, యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాలు తర్వాతి స్థానాల్లో ఉండగా, అడ్డగూడూరు మండలంలో కేవలం మూడు డాక్యుమెంట్లలో మాత్రమే ఫ్రాడ్ జరిగినట్లు తేలింది. పూర్తిస్థాయి విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వరంగల్ పోలీసుల అదుపులో మరో నలుగురు
యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూరు, గుండాల మండలాలకు చెందిన మరో నలుగురు ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
అవినీతి బయటపడడంతో చౌటుప్పల్‌కు చెందిన ఇద్దరు ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారీలోకి వెళ్లారు. వీరి బంధువులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు, ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు పిలిపించి ఆరా తీస్తున్నారు.
తహసీల్దార్ల నిర్లక్ష్యమే కారణం?
స్లాట్ బుకింగ్ అవినీతిలో తహసీల్దార్ల నిర్లక్ష్యమూ కీలక కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పేమెంట్ స్టేటస్‌లో చెల్లించాల్సిన మొత్తం, చెల్లించిన మొత్తం స్పష్టంగా కనిపించినా రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్ రెండో లేదా మూడో పేజీలో ఉండే ‘ఎండార్స్‌మెంట్’ను పరిశీలించకపోవడమే ఈ మోసానికి దారితీసిందని చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్లపై సరైన పర్యవేక్షణ, క్రమం తప్పని ఆడిట్ నిర్వహించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టం ముందే బయటపడేదని రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు.
ఇప్పుడు ఎర్రర్ ఎందుకు రావడం లేదు?
ధరణి పోర్టల్ ప్రారంభమైన ఏడాదికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని సవరించింది. అప్పట్లో స్టాంప్ డ్యూటీ పెరగకముందే స్లాట్ బుక్ చేసుకున్న వారు తక్కువ మొత్తంతో రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే పేమెంట్ స్టేటస్ వద్ద ‘ఎర్రర్’ చూపించేది. పెరిగిన మొత్తాన్ని చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ జరిగేది.
అయితే ప్రస్తుతం స్టాంప్ డ్యూటీ కంటే తక్కువ మొత్తాన్ని చెల్లించినా స్లాట్ బుకింగ్‌తో పాటు రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. గతంలో ‘ఎర్రర్’ చూపిన పోర్టల్ ఇప్పుడు ఎందుకు చూపించడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులే కాకుండా పెద్ద తలకాయలు కూడా ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.
