బడ్జెట్ సమావేశాల్లోనే వృద్ధుల కోసం కొత్త చట్టం.. నిర్లక్ష్య ఉద్యోగుల జీతంలో 10–15% కోత: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్:
వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లోనే వృద్ధుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా చూసే ప్రభుత్వ ఉద్యోగులపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, విచారణ అనంతరం సదరు ఉద్యోగి జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చట్టబద్ధ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ప్రజాభవన్లో ‘బాల భరోసా’ పథకాన్ని, అలాగే వర్చువల్గా వయోవృద్ధుల డే కేర్ సెంటర్లు ‘ప్రణామ్’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
వృద్ధుల కోసం ‘ప్రణామ్’.. ప్రభుత్వమే పెద్దకొడుకు
వయసు మళ్లిన తల్లిదండ్రుల కోసం దేశంలోనే తొలిసారిగా ‘ప్రణామ్’ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. వృద్ధాప్యంలో కొందరు పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, అలాంటి వృద్ధులకు మానసిక ఉల్లాసం, వినోదం, భద్రత కల్పించేందుకే ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వమే వృద్ధులకు పెద్దకొడుకుగా మారి, వారందరినీ ఒకచోట చేర్చి అండగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తించి, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని, ఆ బాధ్యతతోనే ‘ప్రణామ్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.
తల్లిదండ్రులను గాలికి వదిలేస్తే సహించం
గ్రూప్-1, గ్రూప్-2 వంటి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని అత్తవారి పట్ల శ్రద్ధ చూపుతూ, సొంత తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టంగా హెచ్చరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలు తమను చూడటం లేదని స్థానిక తహసీల్దార్ లేదా ఎంపీడీవోకు ఫిర్యాదు చేస్తే, దాన్ని పూర్తిగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సదరు ప్రభుత్వ ఉద్యోగి జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
ఈ చట్టాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో తీసుకురాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
