ఘట్కేసర్ సర్కిల్లో కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం.. ఫైళ్లు, ఫర్నిచర్ బూడిద
హైదరాబాద్:
ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న కెనరా బ్యాంకులో సోమవారం (జనవరి 12) సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ బ్యాంకులో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సాయంత్రం సుమారు 8.30 గంటల తర్వాత బ్యాంకు భవనంలో నుంచి మంటలు మరియు దట్టమైన పొగలు వెలువడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం?
ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఫైళ్లు, ఫర్నిచర్కు నష్టం
ఈ ప్రమాదంలో బ్యాంకుకు చెందిన పలు కీలక ఫైళ్లు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. అలాగే ఫర్నిచర్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. మంటలు వేగంగా వ్యాపించడంతో బ్యాంకు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో స్థానికులు గుమిగూడారు.
ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
