పొరపాటున రాంగ్ UPIకి డబ్బు పంపారా? కంగారు పడకండి.. ఇలా వెనక్కి తెచ్చుకోండి
యూపీఐ వచ్చిన తర్వాత మనీ ట్రాన్సాక్షన్లు చాలా సులభమయ్యాయి. కానీ ఒక్క చిన్న పొరపాటు జరిగితే డబ్బు వెళ్లాల్సిన వ్యక్తికి కాకుండా వేరొకరి ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. రాంగ్ యూపీఐ ఐడీకి లేదా తప్పుడు మొబైల్ నంబర్‌కు డబ్బు పంపితే ఆందోళన చెందడం సహజమే. అయితే కంగారు పడకుండా వెంటనే కొన్ని చర్యలు తీసుకుంటే మీ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
తక్షణమే స్పందించాలి
రాంగ్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే మొదటి 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకం. RBI నిబంధనల ప్రకారం తప్పు వివరాలు నమోదు చేయడం వల్ల జరిగే లావాదేవీలకు వినియోగదారుడే బాధ్యత వహించాలి. అయినప్పటికీ నగదు రికవరీ కోసం బ్యాంకులు, ఎన్‌పీసీఐ ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నాయి.
డబ్బు తప్పుగా వెళ్లిందని గుర్తించిన వెంటనే మీరు ఉపయోగించిన గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లోని Help / Report a Problem సెక్షన్‌లో కంప్లెయింట్ నమోదు చేయాలి.
బ్యాంకును సంప్రదించడం మర్చిపోవద్దు
యాప్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు వెంటనే సమాచారం ఇవ్వాలి. వీలైతే హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి బ్యాంక్ మేనేజర్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం మంచిది.
ఫిర్యాదులో తప్పనిసరిగా ఈ వివరాలు ఇవ్వాలి:
- ట్రాన్సాక్షన్ ఐడీ
- తేదీ, సమయం
- పంపిన మొత్తం
- తప్పుడు యూపీఐ ఐడీ / మొబైల్ నంబర్
అవతలి వ్యక్తి ఖాతా అదే బ్యాంకులో ఉంటే రికవరీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. వేరే బ్యాంకు అయితే మీ బ్యాంక్, సంబంధిత బ్యాంకుతో సంప్రదించి సదరు వ్యక్తి అనుమతితో డబ్బు వెనక్కి వచ్చేలా ప్రయత్నిస్తుంది.
NPCI పోర్టల్ ద్వారా ఫిర్యాదు
యాప్ లేదా బ్యాంక్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
Dispute Redressal Mechanism సెక్షన్‌లో ట్రాన్సాక్షన్ వివరాలు నమోదు చేయాలి.
అలాగే NPCI టోల్‌ఫ్రీ నంబర్ 1800-120-1740కు కాల్ చేసి కూడా కంప్లెయింట్ ఇవ్వొచ్చు.
RBI అంబుడ్స్‌మన్ చివరి మార్గం
బ్యాంక్‌కు ఫిర్యాదు చేసిన 30 రోజుల్లో సరైన సమాధానం రాకపోతే, RBI CMS పోర్టల్ ద్వారా ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు మళ్లించవచ్చు. డిజిటల్ లావాదేవీల్లో వినియోగదారుల రక్షణ కోసం ఇది అత్యున్నత పరిష్కార మార్గం.
ముందస్తు జాగ్రత్తే ఉత్తమం
డబ్బు పంపే ముందు అవతలి వ్యక్తి పేరు, యూపీఐ ఐడీని ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం అత్యంత సురక్షితం. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందులకు దారితీస్తుందని గుర్తుంచుకుని జాగ్రత్తగా పేమెంట్లు చేయడం మంచిది.
