రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి
దుబ్బాక:
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగురుతుందని కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే దుబ్బాకలో కాంగ్రెస్ జోష్ స్పష్టంగా కనిపిస్తోందని, ఇప్పటికే ఆ ప్రాంతంలో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని తెలిపారు. అదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి వివేక్ తెలిపారు. రూ.15 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి జరుగుతోందని, మున్సిపాలిటీలకు రూ.50 లక్షల చొప్పున నిధులు కేటాయించామని చెప్పారు.
ఆరు గ్యారంటీలపై ప్రజలు సంతృప్తి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ పూర్తిచేశామని, ఇంకా రుణమాఫీ కానివారు ఎవరైనా ఉంటే తమకు పేర్లు ఇస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వంపై విమర్శలు
గత ప్రభుత్వం పేదల సొంతింటి కలను పట్టించుకోలేదని మంత్రి వివేక్ విమర్శించారు. పదేళ్ల పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వందల ఎకరాల్లో ఫాం హౌస్‌లు నిర్మించుకున్నారే తప్ప పేదలను పట్టించుకోలేదన్నారు.
ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు భరోసా
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
పేదలకు సన్నబియ్యం
గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం దందా జరిగిందని ఆరోపించిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
