రూ.కోట్లు నిర్వాహకుల చేతికి.. అప్పుల ఊబిలో జూదగాళ్లు
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
సంక్రాంతి నేపథ్యంలో గ్రామాల్లో సందడి నెలకొంది. పండగ అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బందువులంతా ఒక చోట చేరి సరదాగా గడపాల్సిన సమయం. కొంత మంది దీనిని తమ సంపాదనకు మార్గంగా మార్చేశారు. సంప్రదాయం పేరిట కోడి పందేలు, గుండాట నిర్వహిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. సామాన్యులు కష్టార్జితం కోల్పోయి మరింత అప్పుల్లో మునిగిపోతున్నారు. బరిలో ఓ మోస్తరు ఆర్థిక స్థోమత ఉన్నవారు ఉంటుండగా.. బరి బయట ఉన్న వేల మంది సామాన్యులు పందేలు కట్టి ఇల్లు గుళ్ల చేసుకుంటున్నారు.
కుటుంబ కలహాలు
పండగ మూడు రోజులు జిల్లాలో నిర్వహించే కోడి పందేలు, గుండాట వల్ల అనేక కుటుంబాటు ఆర్థికంగా చితికి పోతున్నాయి. ఒకసారి జూదం ప్రారంభించాక నిండామునిగే వరకు చాలా మంది బయటకు రావడం లేదు. ఇలా రూ.లక్షల్లో పోగొట్టుకుని కష్టాల్లో కూరుకు పోతున్నారు. అప్పులు పెరగడం, ఆస్తులు అమ్మడంతో కుటుంబ కలహాలు ఏర్పడుతున్నాయి.
మచ్చుకు కొందరు..
- అల్లవరం ప్రాంతానికి చెందిన చిరుద్యోగి జీతం రూ.20వేలు. గత ఏడాది కోడి పందేల్లో రూ.2.60 లక్షలకుపైగా నష్టపోయాడు. ఏడాదంతా కుటుంబం గడవడం కష్టంగా మారింది.
- ఉప్పలగుప్తం మండలానికి చెందిన ఓ వ్యక్తి కుమారుడిని ఇంటర్మీడియట్లో చేర్పించాలని రూ.2.50 లక్షలు ఉంచాడు. ఈలోగా సంక్రాంతి కోడి పందేల్లో ఆ డబ్బంతా పోగట్టుకున్నాడు. రాజీపడి చిన్న కళాశాలలో చేర్పించాడు.
- రాజోలుకు చెందిన ఓ వ్యక్తి కోడిపందేల బరుల వద్ద గుండాటలో రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఏడాది గడిచినా వడ్డీ తప్ప అసలు తీరలేదు.
బరిలో రక్తమోడుతూ కోడి కుప్పకూలుతోంది..
వెంటనే రూ.కోట్లు చేతులు మారుతున్నాయి..
ఓడిన వాడు అప్పుల ఊబిలోకి..
గెలిచిన వాడు గొప్పల ఖర్చులోకి..
కొల్లగొట్టేది, లాభపడేది నిర్వాహకులే..
విజేతలు.. పరాజితులు ఇద్దరూ బాధితులే
