పండక్కి రాలేని మనసులు.. అమెరికా వీసా చిక్కుల్లో ప్రవాసాంధ్రులు
ప్రవాసాంధ్రులకు వీసా చిక్కులు
ఉండి, న్యూస్‌టుడే: తెలుగు ప్రజల పెద్ద పండగ సంక్రాంతి. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఎగిరి గంతేసి స్వస్థలాలకు కుటుంబ సభ్యులతో వాలిపోతారు. జన్మభూమిలో గుడో.. బడో.. లేక ఏదొక అభివృద్ధి పనులకు తమ వంతుగా ఆర్థిక సాయం చేస్తుంటారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వీసా నిబంధనలతో ప్రవాసాంధ్రుల్లో ఎక్కువ మంది ఈసారి తమ స్వస్థలాలకు చేరుకోలేకపోయారు.
అమెరికాలో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం, వ్యాపారం, టూరిజం, వైద్యం కోసం వీసాలు జారీ చేస్తారు. విద్య పూర్తయిన తర్వాత ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టీకల్ ట్రైనింగ్) ద్వారా కొంతకాలం పనిచేసే అవకాశముంది. నిర్దేశిత గడువు తర్వాత స్వదేశాలకు తిరిగి చేరుకోవాలనేది నిబంధన. వీసా నిబంధనలు మరింత కఠినతరం అయ్యాక అమెరికాలో విద్యనభ్యసించే వారితో పాటు ఉద్యోగులకు కష్టకాలం మొదలైంది.
తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ‘మా పరిస్థితి అర్థం చేసుకోండి. ఈ పండక్కి రావాలని ఉన్నా.. రాలేకపోతున్నామని’ ఆవేదనతో చెప్పేశారు.
- అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తూ గ్రీన్ కార్డున్న ఒక కుటుంబం భీమవరానికి మూడ్రోజుల కిందట వచ్చింది. ఆ ఉద్యోగి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌తో పాటు ఇతర కంపెనీలు చెబుతున్న మాట ఏమిటంటే.. వ్యక్తిగత పూచీపై వెళ్తే సరే. నిర్దేశిత గడువు లోపు రావాలి. లేనిపక్షంలో ఉద్యోగ భద్రతపై నమ్మకం కల్పించలేమని చెబుతున్నాయని వివరించారు.
- ఎంఎస్ విద్యనభ్యసించేందుకు ఉండి మండలానికి చెందిన ఒక న్యాయవాది తన కుమారుడ్ని అమెరికాకు పంపించారు. విద్యాసంవత్సరం మధ్యలో స్వదేశానికొస్తే తిరిగెళ్లే విషయంలో వీసా నిబంధనలతో ఎక్కడ చిక్కుకుపోతామోననే.. ఆందోళనతో ఆ విద్యార్థి సంక్రాంతికి స్వస్థలానికి రాలేకపోతున్నానని సమాచారమిచ్చాడు.
- కలిగొట్లలోని ఓ ప్రవాసాంధ్రుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. గ్రామంలో ఆయన కొన్ని అభివృద్ధి పనులకు తనవంతు సహకారాన్ని అందించారు. ఈసారి తాను పండక్కి రాలేకపోతున్నాననే వర్తమానాన్ని పంపించారని అతని తల్లిదండ్రులు వివరించారు.
