“కేసీఆర్ పట్టించుకోని ఆలయాలకు నేడు ప్రాధాన్యం” – సీతక్క వ్యాఖ్యలు
హైదరాబాద్: రాజన్న, సమ్మక్క సారలమ్మ ఆలయాలను మాజీ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మంత్రి సీతక్క విమర్శించారు. శుక్రవారం (జనవరి 16) వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి అత్యంత గొప్పగా చేపడుతున్నారని తెలిపారు. సమ్మక్క జాతర నేపథ్యంలో ముందుగా వేములవాడలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు చెప్పారు.
వేములవాడ రాజన్న, సమ్మక్క సారలమ్మ ఆలయాలను ప్రధానంగా పేద ప్రజలు దర్శించుకుంటారని, అయితే ఇటీవల ఉన్నత వర్గాల భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. నాలుగు రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో రాజన్న, సమ్మక్క ఆలయాల అభివృద్ధి జరుగుతోందన్నారు. రాజన్న ఆలయం అభివృద్ధి చెందుతోందంటే అందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే శ్రీనివాస్ కృషేనని వ్యాఖ్యానించారు.
సాధారణ భక్తుల మనోభావాలను సీఎం రేవంత్ రెడ్డి గౌరవిస్తున్నారని తెలిపారు. గతంలో రాజన్న ఆలయ అభివృద్ధిపై దుష్ప్రచారాలు చేశారని, అయినా భక్తుల భావాలను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
జనవరి 18న మేడారంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే జనవరి 19న సమ్మక్క సారలమ్మ గుడిని పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు.
