బీహార్‌లో జైభీమ్ తరహా పోలీస్ హింస
నేరం ఒప్పుకోమని యువకుడిపై అమానుషం.. ముగ్గురు పోలీసులు సస్పెండ్
పాట్నా: సినిమాల్లో మాత్రమే చూసిన థర్డ్ డిగ్రీ హింస వాస్తవ జీవితంలో బీహార్‌లో చోటుచేసుకుంది. చేయని నేరాన్ని ఒప్పుకోమని ఓ యువకుడిపై పోలీసులు దారుణంగా హింసించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. నేరాన్ని అంగీకరించాలని ప్రైవేట్ పార్ట్స్‌పై పెట్రోల్ పోసి అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. డిసెంబరులో సమస్తిపూర్లోని ఓ జువెలరీ షాపులో 60 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ ఘటనలో షాపులో పనిచేసే వారే దొంగతనం చేశారన్న అనుమానంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో నాలుగు రోజుల పోలీస్ కస్టడీ అనంతరం వారిని విడిచిపెట్టారు.
ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురిలో ఒకరి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. అతడు క్రిటికల్ కండిషన్లోకి వెళ్లడంతో పోలీసుల కస్టడీలో జరిగిన హింస విషయం బయటపడింది.
పోలీసులు అరెస్టు చేయకముందే జువెలరీ షాపు యజమాని ముగ్గురిని దారుణంగా కొట్టినట్లు బాధితులు తెలిపారు. బిల్డింగ్‌పై నుంచి తోసేస్తామని బెదిరించిన అనంతరం డిసెంబర్ 31న పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.
పోలీస్ కస్టడీలో ముగ్గురినీ తప్పు ఒప్పుకోమని కొట్టినప్పటికీ.. ఒక వ్యక్తిని మాత్రం అత్యంత అమానుషంగా హింసించారు. అతడి ప్రైవేట్ పార్ట్స్‌పై పెట్రోల్ పోసి చిత్రహింసలు పెట్టినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. తీవ్రంగా గాయపడటంతో అతడిని బాండ్‌పై విడుదల చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా విడిచిపెట్టేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
బాధితుడి తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని తేజ్‌పూర్ పోలీస్ స్టేషన్లో మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అతని ఇంట్లో కూడా బంగారం కోసం వెతికారని.. ఏమీ దొరకకపోవడంతో దొంగతనం ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని తెలిపారు.
బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సమస్తిపూర్ ఎస్పీ అర్వింద్ ప్రతాప్ సింగ్ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురు పోలీసులతో పాటు స్టేషన్ ఇన్‌ఛార్జిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో స్టేషన్ ఇన్‌ఛార్జి శంకర్ శరన్ దాస్, రాజ్వంశ్ కుమార్, రాహుల్ కుమార్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
