యువతను మౌనంగా కుంగదీస్తున్న ‘బర్నవుట్ సిండ్రోమ్’
చదువు, ఉద్యోగ ఒత్తిడితో మానసిక క్షీణత.. ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు, సామాజిక సమస్య
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి (23) రోజుకు 12–14 గంటలు పనిచేస్తూ, వీకెండ్స్‌లో కూడా ల్యాప్‌టాప్‌కు అతుక్కుపోయాడు. కొన్ని నెలల్లోనే చేస్తున్న పనిపై ఆసక్తి కోల్పోయి, తీవ్ర ఒత్తిడితో అనారోగ్యం పాలయ్యాడు. మానసిక నిపుణుల చికిత్స, సలహాలతో క్రమంగా కోలుకున్నాడు.
ఇదే తరహాలో ఐఐఎంలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఓ యువతి (22) రోజుకు 16–18 గంటల పాటు నెలల తరబడి చదువులో నిమగ్నమైంది. నిద్రలేమి, ఏకాగ్రత లోపంతో ‘ఇక చదవలేను’ అనే స్థితికి చేరుకుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆమె మానసిక చికిత్సతో కోలుకొని చివరకు తన లక్ష్యాన్ని సాధించింది.
ఇలాంటి ఘటనలు ఇప్పుడు అరుదు కాదు. భారత యువతలో వేగంగా విస్తరిస్తున్న మానసిక సమస్యల్లో ‘బర్నవుట్ సిండ్రోమ్’ ఒకటిగా మారింది. చదువు, ఉద్యోగం, తీవ్రమైన పోటీ, సామాజిక అంచనాలు.. ఇవన్నీ కలిసి యువతను శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తున్నాయి. ఇది ఒక్కరోజు లేదా ఒక్క వారం వచ్చే అలసట కాదు. దీర్ఘకాలంగా కొనసాగుతూ వ్యక్తి జీవన నాణ్యతను తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి.
‘బర్నవుట్’ వ్యక్తిగత వైఫల్యం కాదని, సామాజిక సమస్యగా చూడాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా దీనిని విద్య, ఉద్యోగ సంబంధిత దీర్ఘకాలిక ఒత్తిడి ఫలితంగా గుర్తించింది. భారత్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, సుమారు 24.9 శాతం యువ, మహిళా ఉద్యోగులు బర్నవుట్ ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నట్లు వెల్లడైంది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు, ఉద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది.
“ఎప్పుడూ పరుగెత్తాలి… నేనే ముందుండాలి” అనే సంస్కృతి నుంచి బయటపడితేనే యువత ఆరోగ్యకరమైన భవిష్యత్‌ను నిర్మించగలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. విజయం సాధించడానికంటే ముందు మానసిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమన్న వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
