భగీరథ–కాళేశ్వరం పేరుతో వేల కోట్లు దండుకున్నారు: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించిందని కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. శుక్రవారం (జనవరి 16) చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.45 కోట్ల TUIFDC, CSR నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 7, 8, 9, 12, 13, 14, 17 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. క్యాతనపల్లిలో రూ.45 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన నిరంకుశ పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. అభివృద్ధి పేరుతో కమీషన్ల కోసమే ప్రాజెక్టులు, భారీ భవనాలు నిర్మించారని ఆరోపించారు. మిషన్ భగీరథ పేరుతో రూ.62 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పుకున్నా.. నేటికీ ఒక్క ఇంటికైనా తాగునీటి చుక్క అందడం లేదని మండిపడ్డారు.
రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన పరిస్థితుల్లోనూ గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని ఆ పార్టీ నేతలను డిమాండ్ చేశారు.
చెన్నూరుకు గతంలో ప్రాతినిధ్యం వహించిన బాల్క సుమన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ చిన్నకొడుకు అని చెప్పుకునే బాల్క సుమన్ చెన్నూరు అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదని, కానీ ఇసుక దందా ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు. తాను కమీషన్లు, దందాల కోసం ఎమ్మెల్యేగా రాలేదని.. ప్రజలకు సేవ చేయడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులపై వివరాలు వెల్లడించిన మంత్రి.. సోమనపల్లి గ్రామంలో రూ.250 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపాలిటీల పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే చెన్నూరు నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అమృత్ పథకం కింద చెన్నూరు, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. మరో ఆరు నెలల్లో ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
