Walkie-Talkie Sales: వాకీ టాకీ విక్రయాలు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోకు జరిమానా
దిల్లీ: చట్టవిరుద్ధంగా వాకీ టాకీలను విక్రయిస్తున్న పలు ఈ-కామర్స్ సంస్థలపై కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) సుమోటోగా చర్యలు చేపట్టింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో సహా పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై మొత్తంగా రూ.44లక్షల వరకు జరిమానా విధించింది. (Walkie-Talkie Sales Issue)
వినియోగదారుల రక్షణ, టెలికాం చట్టాలను ఉల్లంఘించి పలు ఈ-కామర్స్ సంస్థలు నిబంధనలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను లిస్ట్ చేసి విక్రయిస్తున్నట్లు సీసీపీఏ గుర్తించింది. సాధారణంగా 446.0-446.2 MHz బ్యాండ్‌లోని పర్సనల్ మొబైల్ రేడియోలకు మాత్రమే లైసెన్స్ మినహాయింపు వర్తిస్తుంది. మిగతా వాటి దిగుమతి, విక్రయాల కోసం తప్పనిసరిగా ఎక్విప్‌మెంట్ టైప్ అప్రూవల్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాక, లైసెన్సింగ్ నిబంధనలకు సంబంధించిన వివరాలను కూడా విక్రయదారులు స్పష్టంగా తెలియజేయాలి.
అయితే, ఫ్లిప్‌కార్ట్ (Flipcart), అమెజాన్ (Amazon), మీషో (Meesho), జియో మార్ట్ (Jio Mart) తదితర ఈ-కామర్స్ సంస్థలు ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు CCPA తెలిపింది. లైసెన్స్ మినహాయింపు ఫ్రీక్వెన్సీ రేంజ్ దాటి ఉన్న వాకీ టాకీలను ఈ కంపెనీలు విక్రయించినట్లు పేర్కొంది. ఇందుకు గానూ మీషో, మెటా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలకు రూ.10లక్షల చొప్పున జరిమానా విధించింది. చిమియా, జియో మార్ట్, టాక్ ప్రో, మాస్క్‌మ్యాన్ టాయ్స్ సంస్థలకు రూ.లక్ష చొప్పున ఫైన్ వేసింది. వీటిలో మీషో, మెటా, చిమియా, జియో మార్ట్, టాక్ ప్రో ఇప్పటికే పెనాల్టీలు చెల్లించినట్లు సీసీపీఏ వెల్లడించింది.
