క్యాతనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు: మహిళలకు రూ.1.71 కోట్ల రుణాలు
క్యాతనపల్లి, జనవరి 19:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో రాష్ట్ర కార్మిక, గనులు మరియు ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.1.71 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాలను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పెట్రోల్ బంకుల కేటాయింపులు కూడా చేస్తున్నామని తెలిపారు.
తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.35 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో గ్రామాలు, పట్టణాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే ప్రాజెక్టులు చేపట్టారని ఆరోపించారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు 1,600 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే అర్హులైన పేదలకు త్వరలోనే 150 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మహిళలు, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తున్నామని, క్యాతనపల్లి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
