తిరుమల కల్యాణవేదికకు విశేష స్పందన – 9 ఏళ్లలో 26,777 ఉచిత వివాహాలు: టీటీడీ
తిరుమల: తిరుమలలోని కల్యాణవేదికకు నూతన వధూవరుల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీటీడీ తెలిపింది. 2016 ఏప్రిల్ 25వ తేదీ నుంచి తిరుమల పాపావినాశనం రోడ్డులో ఉన్న కల్యాణవేదికలో ఉచిత వివాహాలను టీటీడీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2016 ఏప్రిల్ 25 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు మొత్తం 26,777 వివాహాలు నిర్వహించినట్లు టీటీడీ వెల్లడించింది.
కల్యాణవేదికలో నిర్వహించే వివాహాల్లో పురోహితుడు, మంగళవాయిద్యంతో పాటు పసుపు, కుంకుమ, కంకణం వంటి సామగ్రిని టీటీడీ ఉచితంగా అందిస్తోంది. అయితే వివాహానికి అవసరమైన ఇతర సామగ్రిని వధూవరులే తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది. పెళ్లికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని, హాజరు కాలేని పరిస్థితుల్లో సంబంధిత ఆధార పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
వివాహం అనంతరం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతో పాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ వద్ద ఉన్న క్యూలైన్ ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ తెలిపింది. దర్శనానంతరం మ్యారేజ్ రిసిప్ట్‌లో పేర్కొన్న సంఖ్య మేరకు లడ్డూ కౌంటర్‌లో ఉచిత లడ్డూలు పొందవచ్చని వెల్లడించింది.
ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం
కల్యాణవేదికలో ఉచిత వివాహాల కోసం 2016 మే 9 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఉచిత వివాహాలు చేసుకునే జంటలు తప్పనిసరిగా హిందూ మతస్తులై ఉండాలి. వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. ద్వితీయ వివాహాలు, ప్రేమ వివాహాలు ఇక్కడ నిర్వహించబడవని టీటీడీ స్పష్టం చేసింది. అవసరమైతే అవకాశం మేరకు రూ.50 గదిని CRO/ARP కార్యాలయం వద్ద అందిస్తామని తెలిపింది. మరిన్ని వివరాలకు 0877-2263433 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.
సంవత్సరాల వారీగా కల్యాణవేదికలో జరిగిన వివాహాలు:
- 2016–17: 2,731
- 2017–18: 4,705
- 2018–19: 5,047
- 2019–20: 4,443
- 2020–21: 91
- 2021–22: 1,298
- 2022–23: 2,133
- 2023–24: 2,458
- 2024–25 (డిసెంబర్ వరకు): 3,871
మొత్తం వివాహాలు: 26,777
