కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు–అండర్‌పాస్‌లు
తుది దశలో సాయిల్ టెస్టింగ్… మరో నెలలో పనులు ప్రారంభం
హైదరాబాద్ సిటీ: నగరంలోని తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనులు మరో నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. హెచ్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ చేపడుతున్న ఈ పనుల కోసం ఒకవైపు సాయిల్ టెస్టింగ్ తుది దశకు చేరుకోగా, మరోవైపు ఆస్తులు కోల్పోతున్న వారికి టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) అందించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.
తీవ్రమైన ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10, రోడ్ నంబర్ 12, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాసాబ్ ట్యాంక్ వైపు వెళ్లే మార్గాల్లో రోజూ తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆఫీస్ సమయాల్లో, సాయంత్రం వేళల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది.
ఈ సమస్య భవిష్యత్తులో మరింత తీవ్రతరం కాకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.1,090 కోట్ల వ్యయంతో 6 ఫ్లైఓవర్లు, 6 అండర్‌పాస్‌లు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిగ్నల్ ఫ్రీ కారిడార్‌గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వాహనదారుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నారు. ఏడాది క్రితమే ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేసినప్పటికీ, భూసేకరణ ఇబ్బందుల కారణంగా పనులు ఆలస్యమయ్యాయి.
సాయిల్ టెస్టింగ్ తుది దశలో
భూసేకరణ సమస్యలు పరిష్కార దశకు చేరడంతో ప్రస్తుతం ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి సంబంధించి సాయిల్ టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ స్థితిగతులు, నీటి మట్టం వంటి అంశాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికల ఆధారంగా ఫ్లైఓవర్ల డిజైన్, పిల్లర్ల ఎత్తు, నిర్మాణ విధానాన్ని ఖరారు చేయనున్నారు.
రెండు రోజుల్లో టెస్టులు పూర్తి
మరో రెండు రోజుల్లో సాయిల్ టెస్టింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తద్వారా వచ్చే నెలలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కేబీఆర్ పార్క్ ఎకో-సెన్సిటివ్ జోన్ కావడంతో పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పనులు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. చెట్ల తొలగింపును తగ్గించడం, శబ్ద కాలుష్య నియంత్రణ, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిర్మాణ సమయంలోనూ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
భూసేకరణకు టీడీఆర్‌తో ఊరట
ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంలో కొంతమంది వ్యక్తులతో పాటు పలు వాణిజ్య సంస్థలు తమ ఆస్తులు కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి పరిహార విధానం వివరించి ఒప్పిస్తున్నారు. నగదు పరిహారం కోరితే అక్కడి మార్కెట్ రేట్‌కు రెండు రెట్లు, టీడీఆర్ కోరితే మార్కెట్ రేట్‌కు నాలుగు రెట్లు విలువ కల్పిస్తామని అధికారులు తెలిపారు. దీంతో భూసేకరణ సమస్యలు గణనీయంగా తగ్గాయని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
