సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో వినూత్న ఆవిష్కరణలు
రెండో రోజు వేలాదిగా సందర్శకులు
రామచంద్రాపురం (సంగారెడ్డి జిల్లా): సైన్స్ అంటే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదని మరోసారి నిరూపించింది సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్. కొల్లూర్ గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం ప్రారంభమైన ఈ వైజ్ఞానిక ప్రదర్శన రెండో రోజు సందర్శకులతో కిటకిటలాడింది. ఈ నెల 23 వరకు కొనసాగనున్న ఈ ఫెయిర్‌లో ప్రదర్శించిన వినూత్న ఎగ్జిబిట్లు విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలను ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మొత్తం 223 ఎగ్జిబిట్లను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో 55 గ్రూప్ ప్రాజెక్టులు, 85 వ్యక్తిగత ప్రాజెక్టులు, 59 టీచర్స్ ఎగ్జిబిట్స్, 24 ఎన్జీవోలకు సంబంధించిన ప్రదర్శనలు ఉన్నాయి. రోజుకు సుమారు 4 వేల మంది విద్యార్థులు ఫెయిర్‌ను సందర్శించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
తక్కువ ఖర్చుతో అగ్రికల్చర్ డ్రోన్
పాండిచ్చేరికి చెందిన ఉపాధ్యాయుడు వీరమణి ఖండన్ రూపొందించిన తక్కువ ఖర్చు వ్యవసాయ డ్రోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తక్కువ బరువు, ఎక్కువ దృఢత్వం కలిగిన విండ్ బ్లేడ్స్‌ను ఉపయోగించి, ట్రాన్స్మిటర్–రిసీవర్ సిస్టమ్‌తో మోటార్లను కనెక్ట్ చేసే వినూత్న విధానాన్ని ఆయన అభివృద్ధి చేశారు.
5200 ఎంఏహెచ్ బ్యాటరీలను రొటేషన్ సిస్టమ్ ద్వారా హై టార్క్ రిలీజ్ అయ్యేలా రూపొందించారు. ఇందులో ఆటో పైలట్ విధానం ఉండటంతో రైతులు యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా నిర్దిష్ట పొలం, పంటను సెలెక్ట్ చేసి డ్రోన్‌ను ఆపరేట్ చేయవచ్చని వివరించారు.
టాయిలెట్ వాటర్‌తో కరెంట్ ఉత్పత్తి
తమిళనాడుకు చెందిన విద్యార్థిని ధానుశ్రీ రూపొందించిన యూరిన్ పవర్ జనరేషన్ సిస్టమ్ అందరి దృష్టిని ఆకర్షించింది. వృథాగా పోయే టాయిలెట్ వాటర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ టెక్నాలజీలో కాపర్, అల్యూమినియం ఎలక్ట్రోడ్స్‌తో రియాక్షన్ జరిపి పవర్ జనరేట్ చేశారు.
విద్యుత్ ఉత్పత్తి అనంతరం అదే నీటిని శుద్ధి చేసి వ్యవసాయం, గార్డెనింగ్, నిర్మాణ పనులకు ఉపయోగించవచ్చని ఆమె వివరించారు.
బస్సు ప్రమాదాల నివారణకు స్మోక్ & హీట్ సెన్సర్
ఇటీవల కర్నూలు బస్ ప్రమాదంలో 19 మంది మృతి చెందడంతో చలించిన ఆంధ్రప్రదేశ్ ఏలూరుకు చెందిన విద్యార్థులు గాయత్రి, శరణ్య వినూత్న పరిష్కారంతో ముందుకు వచ్చారు. జడ్పీహెచ్ఎస్లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థులు రూపొందించిన స్మోక్ అండ్ హీట్ సెన్సర్ బస్సులు, కార్లలో అమర్చితే ప్రమాద సమయంలో అలారం మోగడంతో పాటు ఎమర్జెన్సీ డోర్లు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయని ప్రయోగాత్మకంగా చూపించారు.
స్పేస్ డెబ్రీస్ సేకరణపై ఆవిష్కరణ
మెదక్ సిద్ధార్ధ రూరల్ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి అక్షయ్ అంతరిక్షంలో పేరుకుపోయిన వ్యర్థాల సేకరణపై ప్రత్యేక ఎగ్జిబిట్‌ను ప్రదర్శించాడు. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పద్ధతిలో సూక్ష్మ స్థాయి స్పేస్ డెబ్రీస్‌ను సేకరించే విధానాన్ని వివరించాడు.
నాసా వంటి సంస్థలు పెద్ద పరిమాణ వ్యర్థాలను మాత్రమే తొలగిస్తాయని, తాను రూపొందించిన సిస్టమ్ ద్వారా మెట్రిక్ టన్నుల సూక్ష్మ వ్యర్థాలను తొలగించి సముద్రంలో డిస్పోజ్ చేయవచ్చని అక్షయ్ వివరించాడు.
స్మార్ట్ ఇంటెలిజెంట్ ఫార్మింగ్ సిస్టమ్
పుదుచ్చేరికి చెందిన విద్యార్థులు జాహ్నవి, సాధిక భవిష్యత్తు వ్యవసాయానికి అనుగుణంగా స్మార్ట్ ఇంటెలిజెంట్ ఫార్మింగ్ సిస్టమ్‌ను ప్రదర్శించారు. సోలార్, విండ్ ఎనర్జీలతో పాటు ఏరో బాండింగ్ న్యూట్రియంట్ వాటర్‌ను ఉపయోగించి తక్కువ నీటితో లాభసాటి వ్యవసాయం చేయవచ్చని చూపించారు.
ఫోటోసింథసిస్, ఆర్టిఫిషియల్ హీట్ సిస్టమ్‌లతో పాటు పంటలు, ఆక్వాకల్చర్‌ను జంతువుల నుంచి రక్షించే పద్ధతులను కూడా ప్రదర్శించారు.
23 వరకు ప్రదర్శన
ఈ నెల 23 వరకు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ కొనసాగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడమే ఈ ఫెయిర్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
