మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, జనవరి 23:
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి. అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో మంచి ఉత్సాహం కనిపిస్తోందని, పార్టీ అభ్యర్థుల విజయం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జీలు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన సంస్థాగత పునాదులున్నాయని , పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించిందని డా. వివేక్ వెంకటస్వామి తెలిపారు. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా సంస్థను మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకత్వం కృషి చేస్తోందని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి వివక్ష లేకుండా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల సంక్షేమం నిర్లక్ష్యం చేయబడిందని ఆయన అన్నారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. రేషన్ కార్డులు జారీ చేశాం. వడ్డీ లేని రుణాలు అందించాం. స్వయం సహాయక సంఘాలకు లబ్ది కల్పించాం. మహిళలకు పెట్రోల్ బంకులు మంజూరు చేశాం,” అని మంత్రి తెలిపారు.
ఇంద్రేశం మున్సిపాలిటీ అభివృద్ధికి ₹15 కోట్ల నిధులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కార్యాలయంతో సమన్వయం చేస్తానని ఆయన ప్రకటించారు.
పార్టీలో ఐక్యత అవసరమని పేర్కొంటూ, వర్గ రాజకీయాలకు దూరంగా ఉండి అందరూ కలిసి పార్టీ అభ్యుర్థుల విజయం కొరకు కృషి చేయాలని డా. వివేక్ వెంకటస్వామి పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. “ఇది ఐక్యంగా పోరాడాల్సిన సమయం. నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలను పార్టీ తప్పక ఆదుకుంటుంది,” అని ఆయన అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ, మొదలు ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఆ విజయం పార్టీ ఉత్సాహాన్ని మరింత పెంచిందని చెప్పారు. దివంగత కాకా వెంకటస్వామి ప్రేరణతో కార్మికులు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తాను పనిచేస్తున్నట్లు ఆయన అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు చేసిన తాజా వ్యాఖ్యలకు స్పందిస్తూ, కేటీఆర్ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ ఓటమి బాటలో నడుస్తోందని డా. వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన నాయకత్వంలో వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆరోపించారు.
“2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద హడావిడి సృష్టించినా ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది బీఆర్ఎస్పై ప్రజల నమ్మకం కోల్పోయినదానికి నిదర్శనం,” అని ఆయన అన్నారు.
