హైదరాబాద్లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ఓవర్ స్పీడ్ డ్రైవింగ్తో ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
హైదరాబాద్లో అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. అతివేగంగా కారు నడపడం ఈ ప్రమాదానికి కారణమైంది. మంగళవారం (జనవరి 27) అర్ధరాత్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ పిల్లర్ నెంబర్ 97 వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వనపర్తి జిల్లాకు చెందిన ఎనిమిది మంది బీటెక్ విద్యార్థులు XUV 700 కారులో (TS 32 G 1888) బోడుప్పల్ నుంచి ఐటీ పోచారం వైపు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కారు అధిక వేగంతో అదుపు తప్పి పిల్లర్ నెంబర్ 97ను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి వరుణ్, నిఖిల్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే మరో ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
గాయపడిన వారిని శ్రీకర ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అర్ధరాత్రి రోడ్లు ఖాళీగా ఉంటాయన్న నిర్లక్ష్య ధోరణి, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ యువత ప్రాణాలను బలిగొంటున్న ఘటనలు పునరావృతమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
