ప్రియుడి భార్యను పెట్రోల్ పోసి చంపిన ప్రియురాలు
నాంపల్లి, (తేదీ):
నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో వివాహేతర సంబంధం ఘోరానికి దారి తీసిన ఘటన చోటుచేసుకుంది. సుజాత అనే మహిళ, నగేష్ యాదవ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. నగేష్ యాదవ్కు అప్పటికే పెళ్లి కాగా, అతనికి ఒక కూతురు ఉంది. అలాగే సుజాతకు ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో తన ఇద్దరు కూతుర్లలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని సుజాత, నగేష్ యాదవ్పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే ఇందుకు నగేష్ యాదవ్ అంగీకరించకపోవడంతో, ఆగ్రహానికి లోనైన సుజాత దారుణానికి పాల్పడింది.
నగేష్ యాదవ్ ఇంటికి వెళ్లిన సుజాత, చంటి పాపకు పాలిస్తున్న అతని భార్య మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో చిన్నారిని దూరంగా విసిరేయగా, మంటలు అంటుకోవడంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది.
అలాగే మంటలకు గురైన చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం నిందితురాలు సుజాత నాంపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
