ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ… మహాజాతరకు ముగింపు
మేడారం :
మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం తిరుగువారం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన వారం రోజుల అనంతరం తిరుగువారం జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగతో సమ్మక్క–సారలమ్మ మహాజాతర కార్యక్రమాలు అధికారికంగా ముగియనున్నాయి.
తిరుగువారం సందర్భంగా పూజారులు ఉదయం ఆలయాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవార్లకు దీపారాధన చేసి, యాటను నైవేద్యంగా సమర్పించనున్నారు. పూజారుల కుటుంబ సభ్యులతో పాటు ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. పూజలు పూర్తయ్యాక పూజా సామగ్రి, వస్త్రాలను ఆలయాల్లో భద్రపరుస్తారు.
ఇదే తరహాలో మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం పునుగొడ్ల గ్రామంలో పగిడిగిద్దె రాజు తిరుగువారం పండుగను ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఇదిలా ఉండగా, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించి హుండీల లెక్కింపును గురువారం నుంచి చేపట్టనున్నారు. ఇందుకోసం మంగళవారం హుండీలను హనుమకొండ పబ్లిక్ గార్డెన్ జంక్షన్‌లోని టీటీడీ ఫంక్షన్ హాల్‌కు తరలించారు. 2024 జాతరలో 760 హుండీలు ఏర్పాటు చేయగా, ఈసారి 788 హుండీలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు భక్తులు ముడుపులు సమర్పించేందుకు 45 క్లాత్ హుండీలు, మూడు ఒడి బియ్యం హుండీలను అందుబాటులో ఉంచారు.
హుండీల లెక్కింపును వారం రోజులలో పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన 170 మంది సిబ్బందిని నియమించారు. గతంలో జాతర కానుకల లెక్కింపులో అనుభవం ఉన్న 150 మంది స్వచ్ఛంద సంస్థల సభ్యుల సేవలను కూడా వినియోగించనున్నారు. లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు కౌంటింగ్ ఏరియాలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హుండీల లెక్కింపు జరగనుంది.
