మేడారం జాతరతో ఆర్టీసీకి ₹3.28 కోట్ల ఆదాయం
భద్రాద్రికొత్తగూడెం :
మేడారం మహాజాతర సందర్భంగా భక్తులను గమ్యస్థానానికి చేర్చడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఆర్టీసీకి భారీ ఆదాయం లభించింది. జాతర కాలంలో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపడంతో ఆర్టీసీకి మొత్తం రూ.3.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మేడారం జాతరకు భక్తుల రద్దీ పెరగడంతో ఖమ్మం, ఇల్లెందు, ఏటూరినాగారం, చర్ల, వెంకటాపురం, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, మంగపేట తదితర ప్రాంతాల నుంచి మొత్తం 214 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపింది. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు 2 లక్షల మంది భక్తులు మేడారానికి రాకపోకలు సాగించినట్లు ఆఫీసర్లు తెలిపారు.
ప్రత్యేక బస్సుల నిర్వహణలో కొత్తగూడెం డిపో ముందంజలో నిలిచింది. కొత్తగూడెం నుంచి 90 ప్రత్యేక బస్సులను నడిపి 45,431 మంది భక్తులను మేడారానికి చేరవేయడంతో ఒక్క ఈ డిపో నుంచే రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతర డిపోల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ప్రయాణించడంతో మొత్తం ఆదాయం రూ.3.28 కోట్లకు చేరిందన్నారు.
జాతర సందర్భంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా భక్తులను సురక్షితంగా చేరవేయడానికి డ్రైవర్లు, కండక్టర్లు అహర్నిశలు కృషి చేశారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అదనపు సర్వీసులు, రౌండ్ ట్రిప్ బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టినట్లు వెల్లడించారు.
మేడారం మహాజాతర వంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక సర్వీసులను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
